
ఆ హీరోయిన్లు ఆలింగనం చేసుకున్నారు!
ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమకు స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి, జయప్రద. అప్పట్లో వీరిమధ్య తెరమీదే కాదు తెరవెనుక బద్ధశత్రుత్వం ఉందని చెప్పుకొనేవారు. అయితే వీరిద్దరు కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఇటు దక్షిణాదిలోనే కాకుండా అటు బాలీవుడ్‌లోనూ తమ హవా కొనసాగించారు. 'దేవత', 'ఆఖిరీ రాస్తా', 'ఔలాద్' వంటి విజయవంతమైన చిత్రాల్లో జయప్రద, శ్రీదేవి కథానాయికలుగా మెప్పించారు. అయితే వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఉండేవి కావని ఓ ప్రముఖ దర్శకుడు కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పారు. అయితే వారిద్దరు కలిసి నటించే సీన్లు విషయంలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా అలనాటి అందాల తారలు శ్రీదేవి, జయప్రద ఇటీవల ఒకే వేదికపై తళుక్కుమన్నారు. ఆత్మీయంగా హత్తుకొని సరదాగా మాట్లాడుకున్నారు. ఈ అరుదైన ఘట్టానికి జయప్రద కొడుకు సిద్ధార్థ వివాహ రిసెప్షన్ వేదిక అయింది. ఈ వేడుకకు భర్త బోనీ కపూర్‌తో హాజరైన శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలువగా.. కంచీవరం పట్టుచీర కట్టుకున్న జయప్రద వారికి స్వాగతం పలికారు. రిసెప్షన్ వేదికపై సరదా గడిపిన ఇరువురు తారలు ప్రస్తుతం తమ మధ్య ఉన్న ఆత్మీయతను చాటుకున్నారు.