
అమ్మతో కలసి జయలలిత వచ్చేవారు
జయలలిత ఇంత త్వరగా చనిపోతారని ఊహించలేదని బాలీవుడ్ నటి హేమమాలిని అన్నారు.
ముంబై: జయలలిత ఇంత త్వరగా చనిపోతారని ఊహించలేదని బాలీవుడ్ నటి హేమమాలిని అన్నారు. జయలలిత, తాను ఒకే సమయంలో సినిమాల్లోకి వచ్చామని, ఇద్దరిదీ ఒకే వయసు అంటూ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు. ఆమెతో కలసి తొలి సినిమాలో నటించే అవకాశం తనకు వచ్చిందని హేమమాలిని చెప్పారు. జయతో పరిచయం గురించి హేమమాలిని ఏ చెప్పారో ఆమె మాటల్లోనే..
''తమిళంలో నాకు తొలిసారి వెన్నిరాడై అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో జయలలిత మరో హీరోయిన్. ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నేను కొన్నిరోజులు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాను. అయితే అప్పట్లో నా వయసు (15) మరీ చిన్నదని, ప్రేమ, అనుబంధాల గురించి అర్థం చేసుకోలేననే ఉద్దేశంతో దర్శకుడు శ్రీధర్ నన్ను ఆ సినిమా నుంచి తొలగించారు. సినిమా నుంచి నన్ను తొలగించడానికి గల కారణాలను అర్థం చేసుకున్నాను.
జయలలితతో కలసి నటించిన కొన్ని రోజుల్లో ఆమెను దగ్గరగా పరిశీలించాను. ఆమె అందం, హుందాతనం నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. జయలలిత తన తల్లితో కలిసి షూటింగ్‌కు వచ్చేవారు. ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఆమెను తొలిసారి సెట్స్ పైనే కలిశాను. నా తొలి సినిమాలో పరిచయమైన ఓ నటి దేశంలో శక్తిమంతమైన నాయకురాలు కావడం నాకు అబ్బురంగా అనిపిస్తుంది. జయలలిత ఓ రాజకీయ నాయకురాలే గాక పేద ప్రజల్లో అమ్మగా స్థానం సంపాదించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు, మహిళల అభ్యున్నతికి ఎంతో సేవ చేశారు. మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకం'' అని హేమమాలిని చెప్పారు.