
ఎవడు అడ్డొచ్చినా తాట తీస్తా : ఘంటా రవి
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ప్రభాస్ వంటి అగ్రహీరో లతో సినిమాలు చేసిన దర్శకుడు జయంత్ సి.పరాన్జీ కొంత విరామం తర్వాత మెగాఫోన్ పట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఘంటా శ్రీనివాసరావు తనయుడు ఘంటా రవిని హీరోగా పరిచయం చేస్తూ, జయంత్ దర్శకత్వంలో శారద ఆర్ట్స్‌పై అనిల్‌కుమార్ కిశన్ నిర్మిస్తోన్న ‘కాళహస్తి’ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత డి.సురేశ్‌బాబు క్లాప్ ఇచ్చారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘మంచి కోసం దూసుకెళ్తా.. ఎవడు అడ్డొచ్చినా తాట తీస్తా’ అని ఘంటా రవి తొలి డైలాగ్ చెప్పారు. ‘‘ప్రేక్షకులను థ్రిల్ చేసే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు.
‘‘జయంత్‌గారి దర్శకత్వంలో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం’’ అని ఘంటా రవి అన్నారు. ఈ చిత్రానికి కథ: దీన్‌రాజ్, మాటలు: హర్షవర్ధన్, ఛాయాగ్రహణం: ఎం.ఎన్.జవహర్ రెడ్డి, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: ప్రశాంత్.