
దక్షిణాది నటీనటులకు మణిరత్నం సినిమాలో నటించటం ఓ కల. అందుకే హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమా అంటే చాలు ఎవరైన ఓకె చెప్పేస్తారు. సీనియర్ నటుల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ మణిరత్నం సినిమాలో చాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి ఓ అరుదైన అవకాశం టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ తలుపు తట్టింది. భర్త మరణం తరువాత నటనకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ నటి చాలా కాలం తరువాత ఓ తమిళ సినిమాకు అంగీకరించింది. మణిరత్నం సినిమా కావటం వల్లనే జయసుధ ఆ సినిమాలో నటించేందుకు అంగీకరించిందట.
చెలియా సినిమాతో నిరాశపరిచిన మణిరత్నం ప్రస్తుతం శింబు, అరవింద్ స్వామి, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతిల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. జ్యోతిక మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ నటించనుంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సఖి సినిమాలో జయసుధ నటించింది. తిరిగి ఇన్నేళ్ల తరువాత మరోసారి మణి దర్శకత్వంలో నటించనుంది. ఇటీవల ఊపిరి సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించిన జయసుధ మరోసారి ఆసక్తికరమైన సినిమాలో కోలీవుడ్ ఆడియన్స్‌ను అలరించనుంది.