రైటింగ్, టేకింగ్ కొత్తగా ఉంటాయి
‘‘అచ్యుత్, ఆనంద్.. అన్నదమ్ములు. ఇద్దరికీ పెళ్లయింది. వీరి జీవితాల్లోకి జ్యో అనే అమ్మాయి ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందనేది చిత్ర కథాంశం. ముక్కోణపు ప్రేమకథా చిత్రం కాదు’’ అన్నారు దర్శకుడు అవసరాల శ్రీనివాస్. నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్య తారలుగా అవసరాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జ్యో అచ్యుతానంద’. వారాహి చలనచిత్రం పతాకంపై శ్రీమతి రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. అవసరాల మాట్లాడుతూ - ‘‘ఊహలు గుసగుసలాడే’ రొటీన్ చిత్రం.
మళ్లీ అలాంటి చిత్రమే తీస్తే దర్శకుడిగా నాపై ఓ స్టాంప్ వేస్తారు. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది. రైటింగ్, టేకింగ్ పరంగా సినిమా కొత్తగా ఉంటుంది. అప్ కమింగ్ హీరోలు చాలామందికి ఈ కథ వినిపించా. ‘మల్టీస్టారర్ వద్దు, సోలో హీరో కథలుంటే చెప్పండి’ అన్నారు. రోహిత్ కథ వినగానే ఓకే చెప్పారు. స్క్రిప్ట్ దశలోనే శౌర్యను దృష్టిలో పెట్టుకున్నా. నాని చేసిన అతిథి పాత్ర ఏమిటనేది సస్పెన్స్.
కల్యాణ్ రమణ సంగీతం చిత్రానికి ప్లస్ అయ్యింది. సాయి కొర్రపాటి గారితో రెండో చిత్రమిది. ఆయనతో మరో చిత్రం చేయాలనుకుంటున్నాను. మా వేవ్‌లెంగ్త్ అంత బాగా కుదిరింది. నా దర్శకత్వంలో నాని హీరోగా ఓ చిత్రం చేయాలి. రెండు ఐడియాలున్నాయి. ప్రస్తుతం ‘హంటర్’ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాను. బోల్డ్ చిత్రమైనా, అందులో ఎమోషన్ నచ్చింది’’ అన్నారు.