నన్ను ఇష్టపడతారు... అసహ్యించుకుంటారు! | Jo Achyutananda set for September 9th release | Sakshi
Sakshi News home page

నన్ను ఇష్టపడతారు... అసహ్యించుకుంటారు!

Published Fri, Aug 26 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

నన్ను ఇష్టపడతారు... అసహ్యించుకుంటారు!

నన్ను ఇష్టపడతారు... అసహ్యించుకుంటారు!

అప్పుడు రెజీనా వయసు 90. మనవళ్లతో హాయిగా కాలక్షేపం చేస్తుంటారు. దాంతో పాటు ఓ సినిమా చూడమని వాళ్లకు చెబుతారు. అదే ‘జ్యో అచ్యుతానంద’. ఆమె అంత బాగా ఇష్టపడి చేసిన సినిమా ఇది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్య తారలుగా సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో రెజీనా చెప్పిన ముచ్చట్లు...
 
  ఈ చిత్రంలో నేను డెంటల్ డాక్టర్‌ని. నా పేరు ‘జో’. మీ పక్కింట్లోనో, ఎదురింట్లోనో ఉండే అమ్మాయిలా ఉంటాను. ఈ మూవీలో నన్ను చూసినవాళ్లు నవ్వుతారు, బాధపడతారు, ఇష్టపడతారు, అసహ్యించుకుంటారు. ఇంత మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ అవసరాలకు, సాయి కొర్రపాటిగారికి కృతజ్ఞతలు. మొన్నీ మధ్యే పాటలు విడుదలయ్యాయి. కల్యాణి రమణ (కల్యాణి మాలిక్) అద్భుతమైన పాటలిచ్చారు.  నాకు 90 ఏళ్లు వచ్చినా కూడా నేనీ సినిమాని మర్చిపోను. నా మనవళ్ళకు, మనవరాళ్లకు ‘జ్యో అచ్యుతానంద’ చూడమని చెప్తాను. అంతగా నా మనసుకు దగ్గరయిందీ కథ. ‘జో’గా నేను, అచ్యుత్‌గా నారా రోహిత్, ఆనంద్‌గా నాగశౌర్య నటించాం. ప్రధానంగా మా ముగ్గురి మధ్య నడిచే కథ ఇది. కథ విన్నప్పట్నుంచి ఎప్పుడెప్పుడు షూటింగ్ ఆరంభమవుతుందా? అని ఎదురు చూశా.
 
  షూటింగ్ పూర్తయ్యాక ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నా.  నేనే ఇంటర్వ్యూ ఇచ్చినా ‘మీకు, సాయిధరమ్ తేజ్‌కు బ్రేకప్ అయ్యిందా’ అని అడుగుతుంటారు. ‘‘మా ఇద్దరి మధ్య ఏదో ఉందని రాస్తారు. ఆ తర్వాత బ్రేకప్ అని రాస్తారు. కాసేపు రెజీనా పనైపోయింది అంటారు. ప్రస్తుతం తనకు సినిమాలు లేవు’’ అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు రాసుకుంటారు.  బాధగా ఉంటుంది. అయినా అందరికీ విడివిడిగా సమాధానం చెప్పలేను. చెప్పను కూడా. ప్రస్తుతం హిందీ చిత్రం ‘ఆంఖే-2’లో నటిస్తున్నా. అమితాబ్‌గారు, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, అర్జున్ రాంపాల్.. ఇలా భారీ తారాగణంతో ఈ చిత్రం ఉంటుంది. ఈ మధ్య ఫోటోషూట్  జరిగింది. ఇప్పటివరకూ అలాంటి భారీ ఫొటోషూట్‌లో నేను పాల్గొనలేదు. ఆ ఇమేజెస్ ఎప్పుడు బయటకు వస్తాయా? అని ఎదురుచూస్తున్నా.
 
 ఇది కాకుండా తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. తెలుగులో చేసిన ‘జ్యో అచ్యుతానంద’తో పాటు, ‘శంకర’ కూడా రిలీజుకు రెడీగా ఉంది.  హీరోలకైతే ఆ స్టార్ ఈ స్టార్ అని బిరుదులుంటాయి... మరి అనుష్క, సమంత, రకుల్ వంటి హీరోయిన్లకు? మీరైతే ఎలాంటి బిరుదు ఇస్తారు? అనే ప్రశ్న రెజీనా ముందుంచితే - ‘‘సమంతకు సూపర్‌స్టార్, అనుష్కకు తలైవా (నాయకుడు), రకుల్‌కి జిమ్ స్టార్, రాశీఖన్నాకి క్యూట్ స్టార్, నిత్యామీనన్‌కు నేషనల్ స్టార్....నాకేమో ఫన్ స్టార్ అని ఇస్తాను’’ అని సరదాగా అన్నారు.     
 - శివ మల్లాల
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement