వాళ్లిద్దరూ అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారు - రాజమౌళి
‘‘‘జ్యో అచ్యుతానంద’ ట్రైలర్ చూస్తుంటే కామెడీ రొమాంటిక్ మూవీ అని తెలుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించాడు. ఈ చిత్రంలో అన్నదమ్ముల్లా నటించిన నాగశౌర్య, నారా రోహిత్ నిజంగానే అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారు. రెజీనా బాగా నటించింది. కల్యాణి రమణ మంచి పాటలిచ్చారు. దర్శకునిపై నమ్మకంతో సినిమాలు తీసే నిర్మాత సాయి కొర్రపాటిగారు.
ఈ చిత్రం విజయవంతమవుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అన్నారు. నాగశౌర్య, నారా రోహిత్, రెజీనా ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో సాయి శివాని సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జ్యో అచ్యుతానంద’.
కల్యాణి రమణ స్వరపరచిన ఈ చిత్రం పాటలు, ట్రైలర్‌ను రాజమౌళి విడుదల చేశారు. శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రకథ నారా రోహిత్‌కు చెప్పాలనుకున్నప్పుడు ఆయన చేస్తారా? చేయరా? అనే సందేహం ఉండేది. కథ విన్నాక చేస్తానన్నారు. ఆనంద్ పాత్ర రాసుకునేటప్పుడే నాగశౌర్యనే అనుకున్నా. యువతరంతో పాటు అన్నివర్గాల వారికీ ఈ చిత్రం నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘జ్యో అచ్యుతానంద’ రీమేక్ రైట్స్ కోసం తమిళం, బాలీవుడ్‌లో చాలామంది పోటీ పడుతున్నారు. జీవితం అనే జర్నీలో సాయి కొర్రపాటిగారిని, శ్రీనివాస్ అవసరాలను కలుసుకునే మంచి అవకాశం వచ్చింది.
నా తల్లిదండ్రుల తర్వాత నేను అంత గౌరవం ఇచ్చే వ్యక్తి సాయి కొర్రపాటిగారే’’ అని నాగశౌర్య చెప్పారు. నారా రోహిత్ మాట్లాడుతూ- ‘‘కథను నమ్మి చిత్రాలు తీసే నిర్మాత సాయి కొర్రపాటి. ఆయన బ్యానర్‌లో నేను చేసిన ‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ, ఈ చిత్రం మాత్రం హిట్టవుతుంది. శ్రీనివాస్ అవసరాల వల్లే ఈ సినిమా ఒప్పుకున్నా. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే బంధాన్ని చక్కగా చూపించాం’’ అన్నారు. నాని, తమ్మారెడ్డి భరద్వాజ, ‘జెమినీ’ కిరణ్, విజయేంద్ర ప్రసాద్, ఎంఎం కీరవాణి, కల్యాణి రమణ, నందినీరెడ్డి, భాస్కరభట్ల, స్మిత తదితరులు పాల్గొన్నారు.