అవార్డుల కంటే సేవే గొప్పది..
దశాబ్దం క్రితమే సినిమాల్లోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించిన వివేక్ ఒబెరాయ్ భిన్నపాత్రలు పోషించి జయాపజయాలు, వివాదాలను ఎదుర్కొన్నాడు. అయితే అవార్డులు, హిట్ల కంటే సామాజిక సేవే తనకు ముఖ్యమని ఇతడు చెబుతున్నాడు. ‘నటనంటే చాలా ఇష్టం. మనసుకు సంతృప్తి మాత్రం ఇతరులకు సాయపడడం ద్వారానే దక్కుతుంది. బాధితుల కన్నీళ్లు తుడిచి చిరునవ్వు తెప్పించడం అన్నింటి కంటే గొప్పది’ అని ఈ 37 ఏళ్ల నటుడు అన్నాడు. అమితాబ్, ఐశ్వర్యారాయ్, సల్మాన్‌ఖాన్, ఆమిర్‌ఖాన్ మాదిరిగానే వివేక్ కూడా చాలాకాలంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. 2004 సునామీ వల్ల పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన గ్రామాన్ని మళ్లీ నిర్మించడానికి సాయం చేశాడు. ఆ ఘటన జరిగినప్పుడు చెన్నైలోనే ఉన్న ఇతడు వెంటనే స్పందించి ఆరు ట్రక్కుల్లో సహాయ సామగ్రి పంపించాడు. అనాథ పిల్లల కోసం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో స్కూలు నడుపుతున్నాడు. బాడీషాప్ అనే సంస్థ చేపట్టిన ‘సపోర్ట్ హర్ ఎడ్యుకేషన్’ ప్రాజెక్టుకూ చేయూతనందిస్తున్నాడు.
‘చాలా మంది మహిళలు సమాజాభివృద్ధి కోసం పనిచేయాలని కోరుకుంటారు. అయితే తగిన వేదిక దొరక్క వారు మిన్నకుంటున్నారు. ఇలాంటి వాళ్ల కోసమే సపోర్ట్ హర్ ఎడ్యుకేషన్ సంస్థ పనిచేస్తోంది’ అని వివరించాడు. వివేక్ తండ్రి, ప్రముఖ నటుడు సురేశ్ బబెరాయ్ మురికివాడల చిన్నారుల అభివృద్ధి కోసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివేక్ తల్లి కూడా కేన్సర్ రోగుల కోసం పనిచేస్తుంటారు. సేవా కార్యక్రమాల నిర్వహణకు తల్లిదండ్రులు తనను ఎంతగానో ప్రోత్సహిస్తారని, ఈ విషయంలో వాళ్లే తనకు స్ఫూర్తి అని వివేక్ చెప్పాడు. 2002లో రామ్‌గోపాల్ వర్మ తీసిన కంపెనీ ద్వారా ఇతడు సినిమాల్లోకి వచ్చాడు. తదనంతరం విడుదలైన ఓంకార, కుర్బాన్, గ్రాండ్‌మస్తీ మంచి ఫలితాలు సాధించాయి. క్రిష్ 3లో తాను చేసిన విలన్‌పాత్రకూ మంచి మార్కులు పడ్డాయి.