ఇచట అన్ని పాత్రలూ చేయబడును!
కొన్ని సినిమాలకు ఊహించనంత హైప్ వచ్చేస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాలైతే కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచీ గుమ్మడికాయ కొట్టేవరకూ రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతుంటాయ్. ప్రస్తుతం ఈ యంగ్ టైగర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘ఇచట అన్నీ రిపేర్లు చేయబడును’ అని టైటిల్‌కి క్యాప్షన్‌గా పెట్టారు. దీన్నే ఎన్టీఆర్‌లోని నటుడికి అన్వయిస్తే.. ‘ఇచట అన్ని పాత్రలూ చేయబడును’ అనొచ్చు. యస్.. ఏ తరహా పాత్రను అయినా ఎన్టీఆర్ చేయగలరు.
‘‘నువ్వు పెద్దయ్యాక పెద్ద హీరో అవుతావు’’ అని ఆనాడు పెద్ద ఎన్టీఆర్ తన మనవడు చిన్న ఎన్టీఆర్ నుదుట తిలకం దిద్దినప్పుడు దేవతలు ‘తథాస్త్తు’ అని ఉంటారేమో. తాతకి తగ్గ మనవడు అని నిరూపించేసుకున్నారు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో బాలనటుడిగా భేష్ అనిపించుకుని, చిన్న రాముడిగా ‘రామాయణం’లో శభాష్ అనిపించుకున్నారు. టీనేజ్‌లో ‘నిన్ను చూడాలని’ ద్వారా హీరోగా పరిచయమైనప్పుడు, అచ్చంగా పెద్ద ఎన్టీఆర్ రూపు రేఖలతోనే చిన్న ఎన్టీఆర్ ఉండటంతో నందమూరి అభిమానులు మురిసిపోయారు. ‘ఆది’తో తిరుగు లేని మాస్ హీరో అనిపించేసుకున్నారు.
‘సింహాద్రి’ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చేస్తూనే, ‘యమదొంగ’లో పౌరాణిక గెటప్‌లోనూ కనిపించి, అలరించారు. ‘బృందావనం’లో అప్పటివరకూ ఉన్న ఇమేజ్‌కి భిన్నంగా లవర్ బాయ్‌లా కనిపించి, ఆకట్టుకున్నారు. ఇక, ‘అదుర్స్’లో చేసిన రెండు పాత్రల్లో బ్రాహ్మణ యువకుడిగా ఎన్టీఆర్ నటన సుపర్బ్. ‘నాన్నకు ప్రేమతో’లో డిఫరెంట్ లుక్‌లో కనిపించి, తనలో క్లాస్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడని నిరూపించుకున్నారు. హీరోగా పదిహేనేళ్ల కెరీర్‌లో దాదాపు పాతిక సినిమాలకు పైగా చేశారు ఎన్టీఆర్. కెరీర్ ఆరంభించినప్పుడు ఎంత జోష్‌గా ఉన్నారో ఇప్పుడూ అంతే జోష్‌గా కొనసాగుతున్నారు.