తాతగారు మళ్లీ పుట్టారు!
ఉద్యోగంలో పదోన్నతి లభిస్తే ఎంతో ఆనందం. ఇక జీవితంలోనే పదోన్నతి లభిస్తే.. ఆనందం అంబరాన్నంటుతుంది. ప్రస్తుతం అలాంటి స్థితిలోనే ఉన్నారు ఎన్టీఆర్. కారణం... ఆయనకు తండ్రిగా ప్రమోషన్ రావడమే. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణతి మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ క్షేమం. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ఎన్టీఆర్ మాట్లాడుతూ,‘‘మళ్లీ తాతగారు పుట్టారు. నా జీవితంలో ఇది మరచిపోలేని రోజు’’ అంటూ సంబరపడిపోయారు. ఎన్టీఆర్ తండ్రి అయినందుకు ఆయన అభిమానుందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్ట్ 1న ‘రభస పాటల పండుగ
ఇది ఇలా ఉంటే... సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకునిగా బెల్లంకొండ సురేశ్ సమర్పిస్తున్న ‘రభస’ చిత్రం స్విట్జర్లాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దాంతో సోమవారం చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. ఆ మరుసటి రోజే ఎన్టీఆర్ తండ్రి అయిన వార్త తెలియడంతో.. యూనిట్ సభ్యులు ఆనందం వెలిబుచ్చారు. బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ -‘‘ఇది నిజంగా శుభవార్త. బుధవారం ముఖ్యతారాగణంపై తీసే షాట్‌తో షూటింగ్ పూర్తవుతుంది.
ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆగస్ట్ 1న వైభవంగా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. యువతరం మెచ్చే కుటుంబ కథగా ‘రభస’ రూపొందుతోందని, ఇందులో ఎన్టీఆర్ స్వయంగా ఓ పాట పాడారని, అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు చెప్పారు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. వెంకటరత్నం, నిర్మాత: బెల్లంకొండ గణేశ్.