
‘జురాసిక్ వరల్డ్ :ఫాలెన్ కింగ్‌డమ్’ సినిమా కోసం ప్రపంచమంతటా సినిమా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జూన్ 22న విడుదలవుతోందీ సినిమా. అంటే అటూ ఇటుగా ఇంకో నెలంత టైమ్ ఉంది. అంతవరకూ ఎదురుచూడక తప్పదు! కానీ వినండి.. సరిగ్గా వినండి.. జూన్ 22వరకూ ఈ హాలీవుడ్ సినిమాను చూడటానికి యూఎస్ ప్రేక్షకులు మాత్రమే ఎదురుచూడాలి. మనం.. అంటే ఇండియన్ సినిమా ప్రేక్షకులం రెండు వారాల ముందే జురాసిక్ వరల్డ్‌ను హ్యాపీగా చూసుకోవచ్చు. అంటే జూన్ 7నే జురాసిక్ వరల్డ్ ఇండియాలో థియేటర్ల ముందుకు వచ్చేస్తోంది.
గత మూడు దశాబ్దాలుగా జురాసిక్ పార్క్ సినిమాలకు, డైనోసర్ జంతువుకు ఇండియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. దీన్ని మనం ఒక హాలీవుడ్ సినిమాగా చూడకుండా ఇండియన్ సినిమానే అన్నట్టుగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇండియన్ సినిమా అభిమానుల టైమింగ్స్, సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని, మనకు సమ్మర్ పూర్తయ్యే టైమ్‌కి జురాసిక్ వరల్డ్‌ను తీసుకొచ్చేస్తున్నారు. ఈ సినిమాకు ఉన్న మేజర్ మార్కెట్స్‌లో ఇండియా ఒకటి.
అందుకే హాలీవుడ్‌కు ప్రధాన మార్కెట్ అయిన యూఎస్‌లో కంటే రెండు వారాల ముందే ఇక్కడ సినిమా వచ్చేస్తోంది. గతంలోనూ ఇండియన్ సినిమా ఫ్యాన్స్ కోసం హాలీవుడ్ సినిమాలను ఒక రెండు వారాలు ముందుగానే విడుదల చేయడం చూస్తూ వచ్చాం. ఇప్పుడు జురాసిక్ వరల్డ్ కూడా ఈ బాట పట్టడం ఇండియన్ ఫ్యాన్స్‌కు పెద్ద న్యూస్. ఈ మధ్యే హాలీవుడ్ సినిమాలకు తెలుగులో ఒక బాక్సాఫీస్ బెంచ్‌మార్క్ సాధించిపెట్టిన ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ (సుమారు 220 కోట్ల రూపాయలు)ను జురాసిక్ వరల్డ్ దాటేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.
300 కోట్ల మార్క్ వరకూ ఈ సినిమా వెళ్లొచ్చని కూడా అనుకుంటున్నారు. 2015లో విడుదలై రికార్డు వసూళ్లు రాబట్టిన ‘జురాసిక్ వరల్డ్’కు సీక్వెల్ ఈ ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్‌డమ్’. యూనివర్సల్ పిక్చర్స్ విడుదల చేస్తోన్న ఈ సినిమాకు జె.ఎ. బయోనా దర్శకుడు. క్రిస్ ప్రాట్, బ్రిస్ డల్లాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. జురాసిక్ పార్క్ ఫ్యాన్స్.. ఆలస్యం చేయకండి.. ముందే చూసేయండీ సినిమాను మరి.. అమెరికా కంటే ముందే..!!
Comments
Please login to add a commentAdd a comment