
అన్నీ కూల్చేసి.. భారత్ ను ఎందుకు వదిలేశారు?
లాస్ వేగాస్ ను నేలమట్టం చేశారు. బుర్జు ఖలీఫాను కూల్చి కుప్పలు చేశారు. లండన్, సింగపూర్ ఇలా ప్రపంచంలోని ప్రముఖ నగరాలను వేటిని వదిలిపెట్టకుండా శిథిలాలుగా మార్చారు. ఒక్క భారత్ మాత్రం అసలు టచ్ చేయకుండా వదిలేశారు. ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ సంస్థ తెరకెక్కించిన తాజా హాలీవుడ్ సినిమా 'ఇండింపెండెన్స్ డే రీసర్జెన్స్' లో ప్రపంచమంతా ధ్వంసమైనట్టు చూపించినప్పటికీ భారత్ లోని ఎలాంటి కట్టడాలు కూలిపోయినట్టు చూపించలేదు. అందుకు కారణం భారతీయుల సున్నితత్వమేనట.
గ్రహాంతరవాసుల దాడిలో దేశదేశాల్లోని కట్టడాలు కూలి నేలమట్టం అయినట్టు చూపించినప్పటికీ, భారత్ లో మాత్రం ఈ విధ్వంసం జరిగినట్టు ఎందుకు చూపించలేదన్న దానిపై చిత్రయూనిట్ తాజాగా వివరణ ఇచ్చింది. 'భారతీయులు మరీ సున్నితంగా ఉంటారు. మత సంస్థలు, పలు సంస్థల కార్యకర్తల సున్నితమైన మనోభావాలను దృష్టిలోపెట్టుకొని భారత్ లో ఈ సినిమా షూటింగ్ చేపట్టవద్దని, ఈ సినిమాలో భారత్ కు సంబంధించిన ప్రముఖ కట్టడాలు కూలిపోయే దృశ్యాలు చూపించవద్దని చిత్ర యూనిట్ ను ఆదేశించారు' అని చిత్ర వర్గాల తెలిపాయి.
గతంలో 'పిక్సెల్' హాలీవుడ్ సినిమాలో తాజ్ మహాల్ ధ్వంసమైనట్టు చూపించగా.. ఆ దృశ్యాన్ని కేంద్ర సెన్సార్ బోర్డు సినిమా నుంచి తొలగింపజేసింది. 'ఇండింపెండెన్స్ డే రీసర్జెన్స్' సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలు చూపిస్తే సెన్సార్ చిక్కులు, భారత్ నుంచి అభ్యంతరాలు వస్తాయనే ఉద్దేశంతో చిత్రయూనిట్ అందుకు సిద్ధపడలేదని తెలుస్తోంది.