తృటిలో తప్పించుకున్న బాహుబలి
హైదరాబాద్ : ప్రపంచమంతా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న'బాహుబలి' చిత్రం తృటిలో పైరసీ భూతం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను చిత్ర దర్శకుడు రాజమౌళి మంగళవారం హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా తొమ్మిదిమంది పైరసీదారులను పట్టుకున్న బెంగళూరు పోలీసులకు రాజమౌళి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పెద్ద సినిమాను పెద్ద తెరపై మాత్రమే చూడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. థియేటర్లలో నైట్ షో అయిన తరువాత సినిమాలను పైరసీ చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని రాజమౌళి తెలిపారు. దీనిపై థియేటర్ యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు ఈ నెల 10న బహుబలి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. చిత్ర పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ భూతాన్ని అరికట్టేందుకు అందరూ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రెండున్నర సంవత్సరాలపాటు అనేక వ్యయ ప్రయాసలకోర్చి, ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ గర్వపడేలా బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించారని అరవింద్ కొనియాడారు.
బెంగళూరు పోలీసుల చొరవ కారణంగా పెద్ద పైరసీ భూతం నుంచి బాహుబలి సినిమా బయట పడిందన్నారు. దేశంలోని సర్వీస్ ప్రొవైడర్లందరికీ ఈ పైరసీ సైట్ల వివరాలను అందించామని, ఆన్లైన్ పైరసీ నియంత్రణకు ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దీనిపై కోర్టు ప్రత్యేక ఆర్డరును జారీ చేసిందని.. ఇక ముందు ఎవరు ఎక్కడ సినిమాను పైరసీ చేసినా క్షణాల్లో తెలిసి పోతుందన్నారు. ఈ సమావేశంలో చిత్ర నిర్మాత శోభూ యార్లగడ్డ, హీరో రానాతో పాటు పలువురు పాల్గొన్నారు.