
జ్యోతిక అవుట్... నిత్యామీనన్ ఇన్!
ఏమైందో ఏమో... తమిళ స్టార్ హీరో సినిమా నుంచి జ్యోతిక తప్పుకున్నారు. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత, జ్యోతికలు హీరోయిన్లుగా నటిస్తున్నారని నిర్మాతలే చెప్పారు. కట్ చేస్తే... వారం తర్వాత డేట్స్ అడ్జస్ట్‌మెంట్ చేయలేక ఈ సినిమా నుంచి జ్యోతిక తప్పుకున్నారనే వార్త బయటకొచ్చింది. ఆల్రెడీ చిత్రీకరణ ప్రారంభించిన విజయ్ టీమ్ మరో హీరోయిన్ కోసం అన్వేషణ ప్రారంభించింది.
విద్యాబాలన్, అసిన్, సిమ్రన్ వంటి పలువురి పేర్లు పరిశీలించారు. చివరికి నిత్యామీనన్‌ని ఎంపిక చేశారట. నటనకు మంచి ఆస్కారమున్న ఆ పాత్రకు నిత్యా అయితే న్యాయం చేస్తుందని చిత్ర బృందం భావించారట. ఇదిలా ఉంటే సమంత, నిత్యామీనన్‌లది హిట్ కాంబినేషన్. ఇద్దరూ కలసి నాలుగు సినిమాల్లో హీరోయిన్లుగా నటించారు. వీళ్లిద్దరూ నటించిన ‘జనతా గ్యారేజ్’లో కాజల్ అగర్వాల్ ‘పక్కా లోకల్’ ఐటమ్ సాంగ్ చేశారు. అదీ హిట్టే. ఆ లెక్కన ముగ్గురిదీ హిట్ కాంబినేషన్ అన్నమాట. త్వరలో నిత్యామీనన్ విజయ్ అండ్ టీమ్‌తో చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం.