కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. తోడ్‌దే దుష్మన్ కి హడ్డీ!
కబడ్డీ... కబడ్డీ... ఆటగాళ్లు, వీక్షకులతో ఓ ఇండోర్ స్టేడియంలో సందడి నెలకొంది. ఆ ఆటగాళ్లలో రాజా (రవితేజ) ఒకడు. ‘కబడ్డీ.. కబడ్డీ..’ అంటూ కూత పెడుతూ ప్రత్యర్థి కోర్టులోకి అడుగు పెడతాడు. అప్పటివరకు అది ఆటే అనుకుంటారంతా! కానీ, రాజా అడుగుతో వేటగా మారుతుంది.
‘కబడ్డీ.. కబడ్డీ..’ అనే కూత ‘తోడ్‌దే దుష్మన్ కి హడ్డీ’ (దుష్టుల/విలన్స్ ఎముకలు విరగొట్టేయ్) అనేలా వినబడుతుంది అందరికీ! అప్పుడు తను అంధుడనే సంగతి ఎవ్వరికీ గుర్తు రానంతగా రాజా ఆడిన ఆట... కాదు.. కాదు.. సాగించిన వేట ‘రాజా ది గ్రేట్’ సిన్మా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందట! రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాజా ది గ్రేట్’.
ఇందులో రవితేజ అంధుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయినా... ప్రేక్షకులు ఆశించే యాక్షన్ సీక్వెన్సులకు ఏమాత్రం లోటు ఉండదట. ముఖ్యంగా కబడ్డీ ఫైట్ చాలా బాగుంటుందని సమాచారం. ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం రవితేజ, రాధిక, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీత దర్శకుడు.