
రజనీకాంత్ ఓ కోహినూర్ డైమండ్! - టీఎస్సార్
‘‘యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్.. రజనీకాంత్ ఏం చేసినా సూపరే. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆయన ఓ కోహినూర్ డైమండ్. అభిమానుల ఉత్సాహం చూస్తుంటే ‘కబాలి’ బంపర్ హిట్ అవుతుందనిపిస్తోంది’’ అని కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డి అన్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘కబాలి’. పా.రంజిత్ దర్శకుడు. తమిళంలో కలైపులి ఎస్.థాను నిర్మించారు. తెలుగులో షణ్ముఖ ఫిలింస్ పతాకంపై ప్రవీణ్‌కుమార్ వర్మ, కె.పి.చౌదరి విడుదల చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని వరుణ్ తేజ్ ఆవిష్కరించగా, షణ్ముఖ ఫిలింస్ లోగోని టి. సుబ్బిరామి రెడ్డి ఆవిష్కరించారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ - ‘‘నాటి ‘బాషా’లో కనిపించినట్లుగా ‘కబాలి’లో రజనీగారు కనిపిస్తున్నారు.
హార్డ్‌వర్క్, సింప్లిసిటీకి ఆయన ఎగ్జాంపుల్’’ అన్నారు. నిర్మాత ప్రవీణ్‌కుమార్ వర్మ మాట్లాడుతూ - ‘‘తూర్పు గోదావరిలో డిస్ట్రిబ్యూటర్‌గా నా ప్రయాణం స్టార్ట్ చేశాను. ఓ పెద్ద సినిమా చేయాలని కేపీ చౌదరి అన్నప్పుడు ‘కబాలి’ బాగుంటుందనుకున్నా. రైట్స్ విషయంలో మోహన్‌బాబుగారు సహాయం చేశారు. ఆయనకు ధన్యవాదాలు. ఫైనాన్షియల్‌గా అల్లు అరవింద్ మద్దతునిచ్చారు’’ అన్నారు. ‘‘రజనీగారిని ‘రోబో’గా చూడడం కంటే ‘బాషా’గా చూడడంలో కిక్ ఎక్కువుంది. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చేది ఆయన ఒక్కరే’’ అని నాని అన్నారు. ఈ వేడుకలో దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, రామజోగయ్య శాస్త్రి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.