రజనీకాంత్ కి నోటీసులు | 'Kabali' to release on July 22 | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ కి నోటీసులు

Published Thu, Jul 21 2016 2:45 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

రజనీకాంత్ కి నోటీసులు

రజనీకాంత్ కి నోటీసులు

 ప్రపంచంలో ఏ చిత్రానికి ఒక రోజును కేటాయించలేదు. ఆ క్రెడిట్ కబాలికే దక్కింది. కబాలి చిత్ర విడుదల రోజు(జూలై 22)ను అభిమానులు ‘కబాలి డే’గా పేర్కొంటున్నారు. ఆ రోజున కొందరు చిత్ర షూటింగ్‌లను రద్దు చేసుకోవడం విశేషం. దర్శకుడు వెంకట్‌ప్రభు తన చిత్ర నిర్మాణ సంస్థ నిర్వాహకులకు కబాలి చిత్రం చూడడానికి జూలై 23న సెలవు ఇచ్చేశారు. కాగా జై, అంజలి జంటగా నటిస్తున్న బెలూన్ చిత్ర షూటింగ్‌ను కబాలి డే రోజున ఆ చిత్ర యూనిట్ రద్దు చేసుకుంది.
 
 అదే విధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆ రోజున  సెలవు ప్రకటించడంతో పాటు, ఉద్యోగులకు కబాలి టిక్కెట్లను ఇచ్చి నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఇక చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల నుంచి పిల్లల వరకూ కబాలి చిత్రాన్ని విడుదలైన మొదటి ఆటనే చూడాలని కోరుకుంటున్నారంటే ఆ చిత్రం ఎంత సంచలనానికి కారణం అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కబాలి చిత్ర థియేటర్లలో టిక్కెట్ల విక్రయాలు చూస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి. రూ.500 నుంచి రూ.1500 వరకూ బ్లాక్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. థియేటర్ల యజమానులే రూ.500లకు విక్రయిస్తున్నారని కోర్టులో పిటిషన్ వేసినా ఫలితం లేకపోయింది. ఇలా కబాలిపై కొన్ని కేసులు కొట్టివేతకు గురైనా మరిన్ని కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
 
 తమిళసినిమా: కబాలి చిత్ర పండుగ ప్రపంచవ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రచారాలు అంబరాన్ని తాకడంతో అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో వీ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కలైపులి ఎస్.ధాను నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం కబాలి. పూజా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచే ఈ చిత్రంపై హైప్ మొదలైంది. కోట్లు ఖర్చు చేసినా రానంత ప్రచారం కబాలి చిత్రానికి దక్కింది. అందుకు ఏకైక కారణం స్టైల్ కింగ్ రజనీకాంత్ అన్నది చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. ఎందిరన్ చిత్రం తరువాత రజనీకాంత్‌కు సరైన విజయాలు లేవన్నది వాస్తవం. అయితే జయాపజయాలకు అతీతుడినని ఆయన నిరూపించుకుంటూనే ఉన్నారు. రజనీ పడిలేచే తరంగం కాదు. ఎప్పుడూ ఎగసిపడే కెరటం లాంటి వారు. అందుకే భారతీయ సినీ నటుల్లో ఎవరికీ లేనంత క్రేజ్ ఆయన సొంతం.
 
  దుమ్ము రేపిన టీజర్
 కబాలి చిత్ర టీజర్ ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపింది. ఏ చిత్రానికి రానంత విశేష స్పందనను రాబట్టుకుంది. కబాలిడా అన్న ఒక్క డైలాగ్‌కే ఆయన అభిమానుల్లో ఉల్లాసం పొంగిపొరలింది. కబాలి కోసం అభిమానులతో పాటు యావత్ సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకు మరో రోజే ఆగాల్సిఉంది.
 
 వినూత్న ప్రచారం
 కబాలి చిత్రానికి కనీవిని ఎరుగని రీతిలో ప్రచారం జరిగింది. ఇప్పటి వరకూ గోడల మీద, భారీ కటౌట్‌తోనే పోస్టర్లను చూసిన ప్రజలు కబాలి పోస్టర్లను దేశ, విదేశీ విమానాలపై మెరవడంపై ఆశ్చర్యపోయారు. ఇక పెద్ద పద్ద కార్పొరేట్ సంస్థలు, వాణిజ్య సంస్థలు చిత్ర ప్రచారంలో భాగస్వామ్యం పంచుకోవడం విశేషం.
 
 తొలిసారిగా మళాయ్ భాషలో
 వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్న కబాలి మరో చరిత్రను నమోదు చేసుకుంది. మళాయ్ భాషలో అనువాదం అయిన తొలి చిత్రంగా రికార్డుకెక్కింది. తమిళ్, తెలుగు, హిందీ లాంటి భారతీయ భాషలతో పాటు మళాయ్ లో డబ్ అవుతున్న తొలి సినిమా కబాలి.
 
 వివాదంలో కబాలి పాట
 కబాలి చిత్రానికి థియేటర్లలో అధిక ధరలకు టిక్కెట్ల అమ్మకాలపై కలుగజేసుకోలేమని చెన్నై హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో మధురై కోర్టులో కబాలి చిత్రంపై మరో పిటీషన్ దాఖలైంది. ఆ ప్రాంతానికి చెందిన మహారాజన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌లో కబాలి చిత్రంలోని ఒక పాటలో ఉలగం ఒరువనుక్కా అనే పదాలను తొలగించాలని పేర్కొన్నారు. ఆ పదాలు బ్యాక్‌వర్డ్ క్యాస్ట్, జరనల్ కేటగిరికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ అందులో పేర్కొన్నారు.
 
 రజనీకి నోటీసులు
 కోవైకి చెందిన శుక్రా ఫిలింస్ భాగస్వామి మహాప్రభు చెన్నై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ రజనీకాంత్ నటించిన లింగా చిత్రం 2014లో విడుదలయ్యిందన్నారు. ఆ చిత్ర కోవై డిస్ట్రిబ్యూషన్ హక్కులను తాము పొందామని తెలిపారు. ఆ చిత్రానికి తమకు భారీ నష్టం ఏర్పడిందన్నారు. అందుకు కబాలి చిత్ర నిర్మాత కలైపులి ఎస్.ధాను,నటుడు రజనీకాంత్  రూ.89 లక్ష లు తమకు తిరిగి చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్లుకోలేదన్నారు. కబాలి చిత్రాన్ని ధాను విడుదల చేస్తున్నారని, తనకు రావలసిన రూ.89లక్షలు తిరిగి చెల్లించేవరకూ కబాలి విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన న్యాయమూర్తి సుందరేశ్ నిర్మాత, రజనీకాంత్ సహా ఏడుగురికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement