
‘క్వీన్’ అవ్వడానికి నేను రెడీ: నటి
క్వీన్‌గా మారడానికి ఏ భాషలోనైనా తాను రెడీ అంటోంది నటి కాజల్ అగర్వాల్.
చెన్నై: క్వీన్‌గా మారడానికి ఏ భాషలోనైనా తాను రెడీ అంటోంది నటి కాజల్ అగర్వాల్. 2014లో హిందీలో సంచల విజయం సాధించిన చిత్రం క్వీన్. ఈ చిత్ర దక్షిణాది రీమేక్ హక్కులు సీనియర్ నటుడు, నిర్మాత త్యాగరాజన్ పొందారన్న విజయం తెలిసిందే. అయితే హిందీలో కంగనారావత్ నాయకిగా నటించిన పాత్రలో చాలా మంది అగ్రనాయికలు ఆసక్తి చూపారు. చాలా మంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో మిల్కీబ్యూటీ తమన్న పేరు ఖరారైనట్లు వార్తలు వెలవడ్డాయి. ఈ చిత్ర కన్నడ రీమేక్ చిత్రీకరణ ఇటీవల ప్రారంభం అయినట్లు ప్రచారం జరిగింది.
అదే విధంగా చిత్ర రీమేక్ హక్కుల విషయంలో వివాదం తెరపైకి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో తాజాగా క్వీన్ అయ్యే అవకాశం నటి కాజల్ అగర్వాల్ తులుపు తట్టిందట. ఈ విషయాన్ని ఇటీవల ఆ అమ్మడే ఒక భేటీలో తెలిపింది. ఆ కథేంటో చూద్దాం. ‘ హిందీ చిత్రం క్వీన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ చిత్ర రీమేక్‌లో నాయకి పాత్రను పోషించాలని ఉంది. లక్కీగా ఆ చిత్ర నిర్మాతలు ఆ పాత్రలో నటించమని నన్ను అడిగారు. నేను అందుకు సరే అన్నాను. అయితే ఇంకా ఒప్పందం కాలేదు. దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.
క్వీన్ రీమేక్‌లో నటించడానికి చాలా మంది హీరోయిన్లు సిద్ధంగా ఉన్నారు కానీ ఆ పాత్ర నన్ను వెతుక్కుంటూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్ర రీమేక్‌లో నేను ఏ భాషలో నటించడానికైనా రెడీ’ అని కాజల్ పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అజిత్‌తో రొమాన్స్ చేస్తున్న వివేగం, విజయ్‌తో డ్యూయెట్లు పాడుతున్న మెర్‌సల్ చిత్రాలు దాదాపు పూర్తి కావచ్చాయి. తెలుగులో రానాతో స్టెప్స్ వేస్తున నేనేరాజు నేనే మంత్రి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాజల్ కి ప్రస్తుతం ఒక కొత్త చిత్రం కావాలి. అందుకే క్వీన్ కోసం ఈ ఫీట్లు అని అనుకోవచ్చా!