
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో ‘పక్కా లోకల్.. నేను పక్కా లోకల్’ అంటూ ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించారు కాజల్ అగర్వాల్. ఇప్పుడు దేశంలోని అందర్నీ ‘పక్కా లోకల్ అనే ఫీలింగ్ తెచ్చుకోండి’ అంటున్నారామె. ఇంతకీ విషయం ఏంటంటే.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా దేశీయ మార్కెట్ వ్యవస్థ కుదేలైంది. దీంతో దేశీయ వ్యాపారాలు, మన దేశంలోని స్థానిక వర్తకులు తిరిగి సరైన గాడిలో పడేందుకు మన వంతు సాయం చేయాలంటున్నారు కాజల్.
ఈ విషయంపై ఆమె స్పందిస్తూ – ‘‘కరోనా మహమ్మారి మన దేశం నుంచి వెళ్లిపోయాక, ఈ అతి పెద్ద ప్రమాదం నుంచి మనందరం సురక్షితంగా బయటపడిన తర్వాత మన దేశం కోసం మనం కొన్ని మంచి పనులు చేయాలి. ఇకపై మన హాలిడేస్‌ను ఇండియాలోనే గడుపుదాం. విదేశీ విహార యాత్రలు వద్దు. లోకల్ రెస్టారెంట్స్‌లోనే భోజనం చేద్దాం. లోకల్ ఫ్రూట్స్, లోకల్ వెజిటబుల్స్ మాత్రమే కొందాం. దేశీయ బ్రాండ్‌లు, ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేద్దాం. మన స్థానిక వ్యాపారస్తులు తిరిగి కోలుకునేంతవరకు మనం వారికి అండగా ఉందాం. పక్కా లోకలైపోదాం’’ అన్నారు కాజల్.