ఫేవరెట్ కార్నర్.. అదే ప్రమాదానికి కారణం
అది చెన్నైలోని ఆళ్వార్‌పేట. అక్కడ కమల్‌హాసన్ ఆఫీస్ ఉంది. ఇంట్లో, ఆఫీసులో ప్రతి గదికీ కార్నర్స్ ఉన్నట్లే ఆ ఆఫీసులో కూడా ఉన్నాయి. ఒక్కే ఒక్క కార్నర్ మాత్రం కమల్‌కి చాలా ఇష్టం. 18 అడుగుల ఎత్తులో ఉన్న ఒక గది కార్నర్ అది. ఆ మూల నిలబడితే రోడ్డు కనిపిస్తుంది. అక్కడ నిలబడి రోడ్డుపై వచ్చే పోయే జనాలను చూస్తూ, ఒకవేళ అది కాకపోతే ఏదో ఆలోచిస్తూ టైమ్‌పాస్ చేస్తుంటారు కమల్. ఆ రోజు కూడా అలానే నిలబడ్డారు. ఎప్పుడూ తీపి అనుభవాలనే మిగిల్చిన ఆ కార్నర్ ఈసారి మాత్రం కమల్‌కి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఆయన ఎక్కడైతే నిలబడ్డారో ఆ ప్రదేశం హఠాత్తుగా కుంగిపోయింది. దాంతో కమల్ 18 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డారు. అంత ఎత్తు నుంచి పడటంతో దెబ్బలు తగిలి విపరీతంగా రక్తం పోయిందట. ‘‘లక్కీగా పక్కన మనుషులు ఉండటంవల్ల ఆస్పత్రిలో చేర్చారు. లేకపోతే చనిపోయి ఉండేవాణ్ణి’’ అని కమల్ పేర్కొన్నారు. ఆ మధ్య ఆయన జారిపడిన విషయం, కాలికి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. కమల్ మెట్ల మీద నుంచి జారిపడ్డారని చాలామంది అనుకున్నారు.
కానీ, ఈ ప్రమాదానికి కారణం ఆయనకు నచ్చిన ఆ కార్నర్. ఈ విషయాన్ని స్వయంగా కమలే తెలిపారు. మరో నెలలోపు ఆయన ‘శభాష్ నాయుడు’ షూటింగ్‌లో పాల్గొంటారనే వార్త వచ్చింది. దానికి కమల్ స్పందిస్తూ - ‘‘నెల రోజుల్లోనా? చాన్సే లేదు. సపోర్ట్ లేకుండా నడవలేకపోతున్నా. కనీసం రెండు నెలలైనా పడుతుంది. ఆ తర్వాతే షూటింగ్’’ అన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ రియల్ డాటర్ శ్రుతీహాసన్ ఆయనకు రీల్ డాటర్‌గా నటిస్తున్నారు.