
వెండితెర వెనుక జీవితం!
వెండితెర మీద వెలిగినపోయిన జీవితాల వెనక వున్న చీకటి కోణాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే తాజాగా శాండిల్వుడ్లో ఓకథానాయిక జీవిత చరిత్ర తెరెకెక్కి సంచలనం సృష్టిస్తోంది. చాలా రోజులుగా కన్నడ ఇండస్టీ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'అభినేత్రి' శుక్రవారం విడుదలైంది. 70వ దశకంలో శాండిల్వుడ్లో కథానాయికగా వెలిగిన నటి కల్పన. అభినేత్రి చిత్రకథ ఆమె జీవితం ఆధారంగానే రూపొందుతుందన్న వార్తలు ప్రారంభంనాటి నుండి వెలువడుతూనే వున్నాయి. పైగా అభినేత్రి టైటిల్ రోల్ దండుపాళ్యంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పూజాగాంధీ పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఆరు నెలలకు ముందే విడుదలకావాల్సిన ఈ సినిమా వివాదాలతో కావాల్సినంత పబ్లిసిటీని వెంటపెట్టుకుని విడుదలైంది. విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. కన్నడ నాట స్టార్ హీరోయిన్గా వెలిగి, వ్యక్తిగత వ్యవహారాలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్న గ్లామర్ హీరోయిన్ కల్పన పాత్రలో పూజాగాంధీ మెప్పించింది. అలనాటి వాతావరణం, లోకేషన్స్ లాంటి విషయాలలో దర్శకుడు సతీష్ పార్తీబన్ శక్తి వంచన లేకుండా కృషిచేశారు.
అయితే వెండి తెరకు సంబంధించిన సినిమా అంటేనే అన్నీ ఒకే రకంగా వుంటున్నాయి. స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్షర్ విజయం సాధించడంతో చాలా మంది కథానాయికలు, ఇలాంటి కథలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమాను చూస్తుంటే విద్యాబాలన్ డర్టీ పిక్షర్, మాధూర్ బండార్కర్ హీరోయిన్, వీణామాలిక్ సిల్క్ సక్కత్ మగ, సనాఖాన్ గజ్జెల గుర్రం లాంటి సినిమాలు గుర్తుకు రాకమానవు.