సాక్షి, బెంగళూరు: చందనసీమకు డిజిటల్ సొబగులను అద్దేందుకు కర్ణాటక చలనచిత్ర అకాడమీ (కేసీఏ) సన్నద్ధమైంది. శాండల్‌వుడ్‌లో ఎనభై ఏళ్లుగా విడుదలైన వాటి నుండి 1,500కు పైగా సినిమాలను డిజిటలైజ్ చేసేందుకు కేసీఏ ప్రణాళికలు రచిస్తోంది. డిజిటలైజేషన్ ద్వారా వాటిని రీస్టోర్ చేసే ప్రక్రియను కేసీఏ చేపడుతుండటం గమనార్హం. ఇక ఈ ప్రక్రియకు గాను దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కేసీఏ అంచనా వేస్తోంది.
అపురూప చిత్రాలను భద్రపరచాలని....
కన్నడ సినీ పరిశ్రమలో గత ఎనభై ఏళ్లలో అనేక అపురూప చిత్రాలు ప్రజల ముందుకు వచ్చాయి. వీటిలో చాలా సినిమాలకు నెగిటివ్‌లు కూడా లభించని పరిస్థితి. కన్నడ సినీ పరిశ్రమలో మొదటి టాకీ అయిన సతీ సులోచన సినిమా నెగిటివ్స్ కూడా ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. సతీ సులోచన, భక్త ధృవ వంటి సినిమాలు ఫోటోల్లో మాత్రమే కనిపించే పరిస్థితి ఏర్పడింది. ఇక కన్నడ సినిమాకు అద్భుత చిత్రాలను అందజేసిన విఠలాచార్య, కెంపరాజ అరస్, బి.ఎస్.రంగ, హుణసూరు క్రిష్ణమూర్తి, ఆర్.నాగేంద్ర రావ్ వంటి దర్శకులు తీసిన అనేక క్లాసిక్స్ సినిమాల నెగిటివ్స్ కూడా లభించని పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలోనే కన్నడ సినీ పరిశ్రమలోని చిత్రాలను డిజిటలైజ్ చేసి భద్రపరచాలని కేసీఏ నిర్ణయించింది.
దాదాపు ఆరు కోట్ల వ్యయంతో.....
ఇక ఈ ప్రక్రియను బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ) ఇచ్చే ఆర్థిక సహాయంతో కేసీఏ చేపట్టనుంది. 1,500 సినిమాలను డిజిటలైజ్ చేసేందుకు రూ.6 కోట్ల వరకు వ్యయమవుతుందని కేసీఏ అంచనా వేస్తోంది. ఇందులో రూ.2 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో విడుదల చేయగా, బీడీఏ మరో కోటి విడుదల చేసింది. ఈ మొత్తంతో ఇప్పటికే డిజిటలైజేషన్ ప్రక్రియను కేసీఏ ప్రారంభించింది. ఇక ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ రెండు విడతలుగా సాగనుంది. మొదటగా ఆయా సినిమాలకు సంబంధించిన పత్రాలన్నింటిని డిజిటలైజ్ చేస్తారు. అనంతరం సినిమాకు సంబంధించిన నెగిటివ్ ను డిజిటలైజ్ చేసి భద్రపరుస్తారు. ప్రస్తుతం చాలా వరకు సినిమాల ఫిల్మ్ సంబంధిత
ప్రొడ్యూసర్‌లు, డిస్ట్రిబ్యూటర్‌లతో పాటు బాదామీ హౌస్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ క్రోడీకరిస్తూ ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ సాగనుంది.
చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి...
ఇక శాండల్‌వుడ్‌కు చెందిన క్లాసిక్స్‌ను భద్రపరిచేందుకు గాను అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని కేసీఏ చైర్మన్ ఎస్.వి.రాజేంద్ర సింగ్ బాబు వెల్లడించారు. ‘ఈ కార్యక్రమానికి సహాయం అందజేసేందుకు కొన్ని ప్రముఖ ఫిల్మ్ ల్యాబొరేటరీలు ముందుకొచ్చాయి. ఇందులో ఏ ఫిల్మ్ ల్యాబొరేటరీకి ఈ బాధ్యతలు అప్పగించాలన్న విషయాన్ని రాష్ట్ర సమాచార శాఖ నిర్ణయించనుంది. ఇప్పుడు కనుక ఈ సినిమాలను భద్రపరచలేక పోతే ఆ తరువాత కన్నడ సినిమా గురించి భావితరాలకు తెలియజెప్పేందుకు ఎలాంటి ఆధారం ఉండదు’ అని రాజేంద్ర సింగ్ బాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment