
తన కవల పిల్లల పుట్టిన రోజు సందర్బంగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ భావోద్వేగ లేఖ షేర్ చేశారు. నేడు(ఫిబ్రవరి 7) కరణ్ కవలలు రూహీ జోహార్, యష్ జోహార్‌లు 3వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. దీంతో వారికి బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కరణ్ తన కవల పిల్లలకు, తన తల్లి హీరూ జోహార్‌లకు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ లేఖ రాశారు. ‘అందరి దృష్టిలో నేను సింగల్ పేరెంట్‌ని.. అది నాకు కూడా తెలుసు.. కానీ వాస్తవానికి కాదు. ఎందుకంటే మా అమ్మ నా సింగిల్ పేరెంటింగ్ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తను నాకు మాత్రమే కాకుండా నా కవల పిల్లలకు కూడా తల్లిగా మారారు. ప్రతీ విషయంలో నాతో పాటు వారికి ఓ తల్లిగా ప్రేమ, ఆప్యాయత పంచుతారు. అదే విధంగా తన మద్దతు లేనిదే ఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోలేను’ అంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
ఇక తన కవల పిల్లలను ఉద్దేశిస్తూ.. ‘ రూహీ, యష్‌లు ఇంట్లో అడుగుపెట్టడంతో మా సంతోషం రెట్టింపు అయ్యింది. ఈ కవలల అల్లరి, ముద్దు ముద్దు మాటలు వింటుంటే రోజురోజుకు ఓ నూతన శక్తిని పొందుతున్న భావన కలుగుతుంది. నిజంగా వీరి రాకతో మా కుటుంబం సంపూర్ణమైంది. ఈ రోజుతో రూహీ, యష్‌లు 3వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా రూహీ, యష్‌ల పేర్లను ఆయన తల్లిదండ్రులు హీరూ జోహార్, యష్ జోహార్‌ల పేర్లలోని మొదటి అక్షరంతో కలిసేలా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా 44 ఏళ్ల మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా పేరున్న కరణ్ సరోగసీ ద్వారా రూహీ, యష్‌లకు తండ్రిగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment