
హైదరాబాద్‌లో కర్నాటక చలన చిత్రోత్సవాలు
‘‘పరభాషల చిత్రాల గురించి తెలుసుకునేందుకు ఫిలిం ఫెస్టివల్స్‌ను రెగ్యులర్‌గా నిర్వహించాలి. చలన చిత్రోత్సవాల నిర్వహణలో మనం వెన కబడ్డాం’’ అని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సి.కల్యాణ్ అన్నారు. హైదరాబాద్‌లో నేటి నుంచి ‘కర్నాటక ఫిలిం ఫెస్టివల్’ జరగనుంది. ఈ సందర్భంగా కర్ణాటక చలనచిత్ర అకాడమీ, హైదరాబాద్ ఫిలిం క్లబ్, సారధీ స్టూడియోస్ ప్రెస్‌మీట్ నిర్వహించాయి. కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘తెలుగు సినిమాలు ఇతర రాష్ట్రాల్లోనూ, ఓవర్‌సీస్‌లోనూ రిలీజ్ అవుతుండటంతో ఆదాయం పెరిగింది.
ఇండియాలోని ఇతర భాషలతో పాటు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను కూడా తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇందుకు తెలుగు పరిశ్రమ నుంచి సహకారం అందిస్తాం’’ అన్నారు. ‘‘కర్ణాటకలో షూటింగ్ చేసిన సినిమాలకు ఐదు కోట్ల సబ్సిడీని అందిస్తున్నాం’’ అన్నారు కర్ణాటక చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ రాజేంద్రసింగ్ బాబు. తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షుడు పి.కిరణ్, హైదరాబాద్ ఫిలిం క్లబ్ కార్యదర్శి ప్రకాష్‌రెడ్డి, దర్శక–నిర్మాత పవన్‌కుమార్, సారధీ స్టూడియో కె.వి. రావు తదితరులు పాల్గొన్నారు.