పిల్లలకు సంబంధించిన ప్రతీ వేడుక తమ సమక్షంలోనే జరగాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. మిగతా రోజుల్లో బిజీగా ఉన్నా ప్రత్యేకమైన రోజున పిల్లలతో గడిపేందుకు సమయాన్ని కేటాయిస్తారు. సెలబ్రిటీలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఇక ఫ్యామిలీ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించే కేజీఎఫ్ స్టార్ యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కూతురు ఐరా పుట్టిన నాటి నుంచి ఆమెను ముద్దు చేస్తూ తనతోనే గడుపుతున్నాడు. యశ్ భార్య, కన్నడ హీరోయిన్ రాధికా పండిట్ ఈ తండ్రీ కూతుళ్ల ఫొటోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూంటారన్న విషయం తెలిసిందే.
తాజాగా ఐరా(8 నెలలు)కు చెవులు కుట్టించారు ఈ జంట. ఈ క్రమంలో చెవి దుద్దులతో మురిసిపోతున్న ఐరాను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసిన రాధిక...‘ ఐరాకు కర్ణవేదన కార్యక్రమం చేశాం. ప్రతీ తల్లిదండ్రుల జీవితంలో ఎదురయ్యే కఠినమైన సమయం ఇదేననుకుంటా. చెవులు కుట్టించేపుడు తను చాలా ఏడ్చింది. దీంతో మా గుండె పగిలినట్లయింది. రాక్‌స్టార్ కళ్లలో మొట్టమొదటిసారి నీళ్లు తిరగడం చూశాను. బంధాలు ఎంత విలువైనవో నాకు ఆ క్షణమే పూర్తిగా అర్థమైంది. అయితే ఇంకో విషయం ఇప్పుడు తండ్రీకూతుళ్లిద్దరూ బాగానే ఉన్నారు’ అంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ క్రమంలో ఐరా క్యూట్ ఫొటోపై స్పందించిన యశ్ అభిమానులు.. ఆ సమయంలో యశ్ హృదయం ఎంత విలవిల్లాడిందో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కన్నడ హీరో అయిన యశ్ కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment