‘ఖైదీ’... ఒక ప్రభంజనం | Khaidi Movie Completing 30 Years Of Release | Sakshi
Sakshi News home page

‘ఖైదీ’... ఒక ప్రభంజనం

Published Mon, Oct 28 2013 12:06 AM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

‘ఖైదీ’... ఒక ప్రభంజనం - Sakshi

‘ఖైదీ’... ఒక ప్రభంజనం

1983... తెలుగు సినిమా ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ సంవత్సరం. ఇదే ఏడాదిలో తెలుగు సినిమాకు చెందిన రెండు అద్భుతాలు జరిగాయి. అందులో ఒకటి మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు సినిమాను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన మహానటుడు ఎన్టీఆర్... ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం. ఎన్టీఆర్ వదిలి వెళ్లిన ‘నంబర్‌వన్’ స్థానాన్ని భర్తీ చేసే నటుడు ఎవరు? అటు ప్రజల్లోనూ, ఇటు పరిశ్రమలోనూ ఎక్కడ చూసినా అప్పట్లో ఇదే ప్రశ్న. అలాంటి తరుణంలో అదే ఏడాది మరో అద్భుతం జరిగింది. అదే  ‘ఖైదీ’. తెలుగుతెరపై మరో తిరుగులేని ప్రస్థానానికి శ్రీకారం చుట్టిందీ సినిమా. 
 
 ‘ఖైదీ’ అనగానే... ఇప్పటికీ గుర్తొచ్చేది ‘పోలీస్ స్టేషన్ ఫైట్’. ఒక అగంతకుడు... పోలీస్టేషన్‌లో పోలీసులందరినీ చావబాదడం అనేది అంతకు ముందెన్నడూ తెలుగు ప్రేక్షకుడు చూడలేదు. చిరంజీవి ఆ ఫైట్ చేసిన తీరు... యావత్ ఆంధ్రదేశం నివ్వెరపోయేలా చేసింది. ‘రగులుతోంది.. మొగలి పొద’ పాటలో... చిరంజీవి, మాధవి కలిసి నర్తించిన తీరు ప్రేక్షకుణ్ణి విస్తుపోయేలా చేసింది. డాన్సుల్లోనూ, ఫైటుల్లోనూ మునుపెరగని వేగాన్ని, ఓ విధమైన స్టయిలిష్ పెర్‌ఫార్మెన్స్‌నీ తెలుగు తెరకు పరిచయం చేసి కొత్త ట్రెండ్‌కి నాంది పలికారు చిరంజీవి.  అప్పటివరకూ సాధారణ హీరో అయిన చిరంజీవి ‘ఖైదీ’తో సుప్రీంహీరోగా అవతరించారు.
 
 చిరంజీవిని రాత్రికి రాత్రి స్టార్‌ని చేసేసిన ‘ఖైదీ’ విడుదలై నేటికి 30 ఏళ్లు. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి కాసేపు గుర్తు చేసుకుందాం.  అప్పటికి చిరంజీవి, ఏ కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు న్యాయంకావాలి, కిరాయిరౌడీలు, ప్రేమ పిచ్చోళ్లు, శివుడు శివుడు శివుడు. ఇదే కాంబినేషన్‌లో సంయుక్త మూవీస్ అధినేతలు కె.తిరుపతిరెడ్డి, కె.ధనుంజయరెడ్డి, కె.నరసారెడ్డిలు ఓ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.  కథ తయారు చేసే బాధ్యతను పరుచూరి బ్రదర్స్ చేతిలో పెట్టేశారు నిర్మాతలు.  బాలీవుడ్ క్లాసిక్ ‘షోలే’ స్క్రిప్ట్‌ను స్టార్ రైటర్స్  సలీమ్-జావేద్‌లు 18 రోజుల్లో పూర్తి చేశారట. అప్పట్లో అది చాలా గొప్పగా చెప్పుకునేవారు. 
 
మరి ‘ఖైదీ’ సినిమాకు సంబంధించిన 56 సన్నివేశాలను పరుచూరి వెంకటేశ్వరరావు ఆరు గంటల్లో రాస్తే, ఆ సన్నివేశాలకు మూడురోజుల్లో సంభాషణలు రాశారు పరుచూరి గోపాలకృష్ణ. మరి వీళ్లను ఎంత గొప్పగా చెప్పుకోవాలి! 1982 జూన్ 16న మద్రాసులోని ప్రసాద్ స్టూడియోలో ‘ఖైదీ’ ప్రారంభోత్సవం జరిగింది. కల్యాణి ఫిలింస్ అధినేత ఎం.సుధాకరరెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, సూపర్‌స్టార్ కృష్ణ క్లాప్ ఇచ్చారు. ముహూర్త బలమో ఏమో... చకచకా నిర్మాణం పూర్తయింది. ఈ చిత్రానికి అయిన నిర్మాణ వ్యయం అక్షరాలా పదిహేను లక్షలు. 1983 అక్టోబర్ 28 విడుదలైన ఈ చిత్రం ఆంధ్రదేశంలో పెను సంచలనానికే తెరలేపింది. చిరంజీవి నట విశ్వరూపానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక మాధవి, సుమలత అందచందాలు యువతరాన్ని విశేషంగా అలరించాయి.
 
 ప్రతినాయకులుగా రావుగోపాలరావు, నూతన్‌ప్రసాద్‌లు అదరహో అనిపించారు. చక్రవర్తి బాణీలు ఈ సినిమా విజయంలో ప్రధాన పాత్రనే పోషించాయి. ‘వేదం నాదం మోక్షం’, ‘రగులుతోంది మొగలిపొద’, ‘గోరింక పూచిందీ..’ ఇలా ప్రతి పాట ఓ ఆణిముత్యమే. వేటూరి, రాజశ్రీ ఈ పాటలకు అద్భుతమైన సాహిత్యం అందించారు. అప్పటివరకూ కుటుంబ చిత్రాల దర్శకునిగా పేరున్న కోదండరామిరెడ్డిని రాత్రికి రాత్రి మాస్ డెరైక్టర్‌ని చేసేసింది ‘ఖైదీ’. ఈ సినిమా  చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌ని ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో పదిహేడు చిత్రాలు రూపొందాయి. 
 
 హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందించిన ఏక్‌నాథ్... తన కెరీర్‌లో బాగా పేరు తెచ్చిన సినిమాల్లో ‘ఖైదీ’ని ప్రముఖంగా చెప్పుకుంటారు. నిప్పులుగక్కే స్టెన్‌గన్స్, అగ్ని కీలలు వెదజల్లే బాంబ్ బ్లాస్టింగులు ‘ఖైదీ’ నుంచే తెలుగు తెరపై మొదలయ్యాయి. 36 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం 20 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శితమైంది. మొదటివారమే 34 లక్షల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుటికీ చిరంజీవి గురించి చెప్పుకోవాలంటే తొలుత గుర్తొచ్చే సినిమా ‘ఖైదీ’నే. ప్రేమ, పగ, సెంటిమెంట్, సంగీతం కలగలిసిన పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా ‘ఖైదీ’. అందుకే ‘ఖైదీ’ ఓ సంచలనం, ఓ ప్రభంజనం, ఓ చరిత్ర.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement