
గాయని శిల్పా మధుసూదన్
సాక్షి, బెంగళూరు: శ్యాండల్‌వుడ్‌ను మీటూ ఉద్యమం కుదిపేస్తోంది. సంజన, శ్రుతి హరిహరన్ ఇలా ఒక్కొక్కరుగా లైంగిక వేధింపులపై ఆరోపణలను సంధిస్తున్నారు. తాజాగా మరో నటి కిమ్ కైరా, గాయని శిల్పా మధుసూదన్ తాము సైతం లైంగిక వేధింపులకు గురైనట్లు ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు శివమణి, అతని మేనేజర్ మహేశ్‌లపై నటి కిమ్ కైరా మీ టూ ఆరోపణలు చేశారు. ముంబైకి చెందిన యువ నటి కైరా కన్నడలో అభిరామి అనే సినిమాలో నటించారు. కన్న డ చిత్రరంగంలో నిలదొక్కుకోవాలని తాపత్రయపడుతున్న తన ఆశలను ఆసరాగా చే సుకుని దర్శకుడు శివమణి, మహేశ్‌లు అకృత్యానికి యత్నించారని ఫేస్‌బుక్‌లో కైరా చె ప్పారు. శివమణి చిత్రంలో నటించే అవకా శం కల్పిస్తానని ఆశ చూపి, ఒక ప్రైవేటు హో టల్‌కు రావాల్సిందిగా మహేశ్ తనకు సూ చించినట్లు కైరా తెలిపారు. మహేశ్ మాటలు నమ్మి తాను ఆ హోటల్‌కు వెళితే అక్కడ తనపై లైంగిక దాడికి యత్నించాడని ఆరోపించారు. మహేశ్‌ప్రవర్తనతో భయపడిన తాను ఎలాగోలా అక్కడ నుంచి బయటపడ్డానన్నారు. ఇప్పటికే హీరో అర్జున్‌సర్జాపై శ్రుతి ఆరోపణలతో కలకలం రేగిన శ్యాండల్‌వుడ్ కైరా వ్యాఖ్యలతో ఇంకా ఇరకాటంలో పడింది.
కైరా ఎవరో తెలియదు: శివమణి
కైరా ఆరోపణలను దర్శకుడు శివమణి కొట్టిపారేశారు. కైరా ఎవరో కూడా తెలియదని చెప్పారు. తాను దర్శకత్వం వదిలేసి ఐదేళ్లు కావస్తుందని, ఇలాంటి సమయంలో తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
గళమెత్తిన గాయని శిల్పా
యువ గాయని శిల్పా మధుసూదన్ కూడా మీ టూ అన్నారు. కన్నడ సంగీత ప్రపంచంలోనూ లైంగిక వేధింపుల సంఘటనలు ఉన్నాయని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అవకాశాల కోసం గాయనిలు కూడా త్యాగాలు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆమె ఎవరి పేరు చెప్పకుండా ఆరోపణలు చేయడంతో ఎవరై ఉంటారనేది చర్చనీయాంశమైంది.
అర్జున్ మంచివాడు: హరిప్రియ
సాక్షి బెంగళూరు: నటుడు అర్జున్‌పై నటి శ్రుతి హరిహరన్ మీటూ ఆరోపణలను మరో నటి హరిప్రియా కొట్టిపారేశారు. ఆమె అలాంటి ఆరోపణలు చేయడం చాలా బాధకరమని అన్నారు. ఏడెనెమిదేళ్లుగా అర్జున్ తెలుసని, ఆయనతో కలసి తమిళంలో ఒక సినిమాలో నటించానని చెప్పారు. ఆయనతో నటించే సమయంలో తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. అర్జున్‌కు సినిమా సెట్‌లో అందరూ గౌరవించేవారని, ఆయన కూడా మహిళలను ఎంతో గౌరవంగా చూసుకునేవారని చెప్పారు. ప్రతి మహిళతో అమ్మ అని సంభోదిస్తూ అర్జున్ మాట్లాడుతారని, అలాంటి నటుడిపై ఇలాంటి విధమైన ఆరోపణలు రావడం చాలా దురదృష్టకరమని తెలిపారు.
రాజీ బాట
నేడు శ్రుతి–అర్జున్ మధ్య సినీ పెద్దల చర్చ
మీ టూ ఆరోపణలతో శాండల్‌వుడ్‌కు కంటిమీద కునుకులేకుండా చేసిన శ్రుతి హరిహరన్– అర్జున్ సర్జా వివాదం కొలిక్కి తెచ్చేందుకు సినీ పెద్దలు ప్రయత్నాలు చేపట్టారు. గురువారం వారిద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయనున్నట్లు కన్నడ ఫిల్మ్ చాంబర్ కార్యధ్యక్షుడు హరీశ్ తెలిపారు. కళాకారుల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు అంబరీశ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే సమావేశానికి కన్నడ సినీరంగ సీనియర్ నటులు బి.సరోజాదేవీ, జయంతి, ప్రేమ, దర్శకుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొననున్నారు. మీటూ ఉద్యమాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని హరీశ్ అన్నారు.