‘‘నాది వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి. సినిమాల్లో నటించాలనే ఆసక్తి 2016లో కలిగింది. ఏడు షార్ట్స్ ఫిల్మ్స్‌లో నటించిన తర్వాత ఇక సినిమాలు చేద్దామనుకున్నా. ఆ సమయంలో డైరెక్టర్ రవికిరణ్ కోలాతో ఏర్పడిన పరిచయంతో ‘రాజావారు రాణిగారు’ చిత్రం చేశా’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ‘‘నటుడిగా నా మొదటì పుట్టినరోజు ఇది. ఈ సందర్భంగా నా కొత్త సినిమా ‘సెబాస్టియన్’ని ఈరోజు ప్రకటిస్తున్నాం. బాలాజీ అనే కొత్త అతను దర్శకత్వం వహిస్తారు.
ప్రస్తుతం నేను హీరోగా ‘ఎస్‌ఆర్ కళ్యాణ మండపం’ సినిమా నిర్మిస్తున్న ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంలోనే ప్రమోద్, రాజుగార్లు ఈ సినిమాని కూడా నిర్మిస్తారు. కల్యాణ మండపం నేపథ్యంలో ‘ఎస్‌ఆర్ కళ్యాణ మండపం’ సినిమా ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. 1975 అని పెట్టడానికి కారణం కల్యాణ మండపం ఆ టైమ్‌లో కట్టిందని చెప్పడానికే. లవ్‌స్టోరీ, తండ్రీ కొడకుల మధ్య బంధం, స్నేహం.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్న చిత్రమిది. ఇందులోని పాత్రలన్నీ కడప జిల్లా యాసలోనే మాట్లాడతాయి. ఈ సినిమా చిత్రీకరణ అంతా కడప జిల్లాలోనే ప్లాన్ చేశాం. నిర్మాతలు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికి 40 శాతం అయ్యింది. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయింది.
ఈ సినిమా షూటింగ్‌లో సాయికుమార్, తనికెళ్ల భరణిగార్ల నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ చిత్రదర్శకుడు శ్రీధర్‌కి ఇది తొలి సినిమా. ముందు ‘1991’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. నాలుగేళ్లుగా కలసి ప్రయాణం చేస్తున్నాం. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ నేనే రాశాను. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్‌గారు మా చిత్రానికి 6 మంచి పాటలిచ్చారు. అన్ని పాటలూ భాస్కరభట్లగారు రాశారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘హీరోలు కృష్ణ, చిరంజీవిగార్లు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగలరు. వాళ్లలా మంచి నటుడనిపించుకోవాలనుకుంటున్నాను. ఏ పాత్ర అయినా పోషించగలననే పేరు తెచ్చుకోవడమే నా లక్ష్యం’’ అన్నారు కిరణ్.
Comments
Please login to add a commentAdd a comment