షమ్నా కాసిం (ఫైల్ ఫోటో)
కొచ్చి: నటి షమ్నా కాసిం (పూర్ణ)ను కిడ్నాప్ చేసి భారీ ఎత్తున డబ్బు దోచుకోవాలని ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మంది సభ్యుల ముఠాలోని ఎనిమిది మందిని అరెస్టు చేశామని మిగతా నలుగురు పరారీలో ఉన్నారని కొచ్చి పోలీస్ కమిషనర్ విజయ్ సఖారే వెల్లడించారు. అలాగే వీరంతా గత మార్చి నెలలో పాలక్కాడ్‌లో ఎనిమిది మంది మోడల్స్ ను బంధించి, డబ్బుల వసూలు చేసిన కేసులో కీలక నిందితులని చెప్పారు.
ఈ సందర్భంగా కిడ్నాప్, బెదిరింపునకు ప్రయత్నించిన ముఠా పథకాన్ని విజయ్ సఖారే మీడియాకు వివరించారు. మొదట షమ్నాతో వివాహ ప్రతిపాదన ద్వారా కుటుంబ సభ్యులతో సంబంధాలు ఏర్పరచుకుని, ఆ తరువాత కిడ్నాప్ చేసి, ఒక హోటల్ గదిలో బంధించి పెద్ద ఎత్తున డబ్బు గుంజాలని ప్లాన్ వేశారని వివరించారు. ఈ క్రమంలోనే షమ్నా నుండి ఒక లక్ష 50 వేల రూపాయలు డిమాండ్ చేశారని ఇది విఫలం కావడంతో కిడ్నాప్ ప్రయత్నాలను ముమ్మరం చేశారని తెలిపారు. సినిమా ఆఫర్ల పేరుతో నటీనటుల వివరాలను సేకరించి, బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయాలనేది వీళ్ల పథకమని పేర్కొన్నారు. సినిమా ప్రొడ్యూసర్లమని చెప్పి ప్రొడక్షన్ కంట్రోలర్ షాజీ ద్వారా అనేకమంది ప్రముఖుల ఫోన్ నంబర్ తదితర వివరాలను సేకరించినట్టు వెల్లడించారు. షమ్నా, ఇతర మహిళల ఫిర్యాదుల ఆధారంగా ఈ ముఠాపై ఏడు కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.
అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హాస్య నటుడు ధర్మజన్ బోల్గట్టిను కూడా పోలీసులు విచారించారు. గ్యాంగ్‌లోని అస్గర్ అలీ తనకు రెండుమూడు సార్లు ఫోన్ చేశాడని బోల్గట్టి మీడియాకు చెప్పారు. ప్రొడక్షన్ కంట్రోలర్ షాజీ తన నంబర్‌ను ఆ గ్యాంగ్‌కు ఇచ్చాడని చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్ సమయంలో తనను సంప్రదించిన ఈ గ్యాంగ్ షమ్ కాసింను పరిచయం చేయాలని అడిగారని బోల్గట్టి వెల్లడించారు. అయితే, ఈ కేసులో సినీ ప్రముఖులకు ఎలాంటి పాత్ర లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా తెలుగులో సీమ టపాకాయ్, అవును సినిమాల ద్వారా పూర్ణ ప్రేక్షకులకు సుపరిచితమే.
Comments
Please login to add a commentAdd a comment