'ఆ పాత్రే నా కెరీయర్ని మలుపు తిప్పింది’
ఏపాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయి పాత్రకు న్యాయం చేసే విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. తనకు హాస్యంతో కూడిన విలన్ పాత్రలంటే ఇష్టమని ఆయన అన్నారు. కోట శ్రీనివాసరావు శుక్రవారం రాయవరంలోని సాయితేజా విద్యానికేతన్ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చారు.ఆ సందర్భంగా తన సినీ జీవిత విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే...
నాటకరంగమే పునాది
నాకు నాటకాలు వేయడమంటే ఇష్టం. రంగస్థలంపై 20 ఏళ్లపాటు నటించాక అనుకోకుండా సినీరంగంలోకివచ్చాను. 1978-79లో ‘ప్రాణం ఖరీదు’ నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన తిలకించిన దర్శక, నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా మలచారు. అందులో నటించిన నటులనే సినిమాలోకి తీసుకున్నారు. అలా తొలిసారిగా ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో నటించాను.
ప్రతిఘటన మలుపు తిప్పింది..
‘ప్రతిఘటన’ సినిమాలో ‘కాశయ్య’ పాత్ర నా సినిమా కెరీర్‌నే మలుపు తిప్పింది. పూర్తిగా సినిమాల్లో స్థిరపడ్డాక ఎస్‌బీఐలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాను.
800 సినిమాల్లో నటించా
ఇప్పటి వరకు సుమారు 800 సినిమాల్లో నటించాను. రక్షణ, గణేష్, గాయం, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, ఆమె, హలో బ్రదర్, మామగారు నటనపరంగా సంతృప్తినిచ్చాయి.
క్రమశిక్షణ అవసరం
నేటి యువతరంసాధన తక్కువ..వాదన ఎక్కువ అన్న చందంగా ఉంది. కఠోర సాధన, క్రమశిక్షణ, ఓర్పు నటులకు చాలా అవసరం.