క్రియేటివ్ కృష్ణవంశీకి మెగా తలనొప్పి!!
ఎందరో టాలీవుడ్ స్టార్లకు సరికొత్త ఇమేజ్ ఇప్పించిన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీకి ఇప్పుడు 'మెగా' తలనొప్పి పట్టుకుందని వినికిడి. నాగార్జునతో నిన్నే పెళ్లాడతా, మహేష్ బాబుతో మురారి, రవితేజకు హీరో ఇమేజి తెచ్చిపెట్టిన సిందూరం.. ఇలా అనేక విజయవంతమైన సినిమాలను తన ఖాతాలోంచి ఇప్పించిన కృష్ణవంశీ.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కుమారుడు రాం చరణ్ హీరోగా 'గోవిందుడు అందరివాడేలే' అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆయనకు రోజుకో కొత్త సమస్య తెచ్చిపెడుతూ.. కంటిమీద కునుకు పట్టకుండా కష్టపెడుదట.
టాలీవుడ్‌లో ఫ్యామిలీ మూవీలు తెరకెక్కించడంలో కృష్ణ వంశీ దారే వేరు. ఆయన రాం చరణ్తో తీస్తున్న గోవిందుడు అందరివాడే అనే ఫ్యామిలీ మూవీ ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. సహజంగానే దాన్ని తీసుకెళ్లి చిరంజీవికి చూపించాడు కృష్ణవంశీ. కానీ, ఆ రషెస్ చూసిన మెగాస్టార్కు అది నచ్చకపోవడంతో ఏకంగా స్టార్కాస్టింగ్ మార్చి మళ్లీ షూటింగ్ చెయ్యాలని ఆదేశించాడట.
సాధారణంగా అయితే కృష్ణవంశీ చాలా సహజంగా తన చిత్రాలను తెరకెక్కిస్తారు. హీరో ఇమేజితో ఏమాత్రం సంబంధం లేకుండా కథనే హీరోగా చేసుకుని తన సినిమాలు తీస్తుంటాడు. కానీ ఈసారి మెగా జోక్యం వల్ల ఇప్పుడు కథలో కూడా మార్పులు చేయాల్సి రావడంతో ఆయన మార్కు ఫ్లేవర్ సినిమాలో కనపడుతుందో లేదోనని అభిమానులు తలపట్టుకుంటున్నారు. ఇదే టెన్షన్తో కృష్ణవంశీ ఆరోగ్యం కూడా పాడైందని వినిపిస్తోంది.