'ఆ 'క్షణం' నా జీవితాన్ని మార్చేసింది'
చెన్నై: గత పదేళ్లుగా కమిడీయన్‌గా అలరిస్తున్న 'సత్యం' రాజేశ్ కెరీర్ 'క్షణం' సినిమాతో కొత్త మలుపు తిరిగింది. ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో సీరియస్ క్యారెక్టర్‌ను సమర్థంగా పోషించి మెప్పించాడు రాజేశ్. 'క్షణం' సినిమాలో తన నటనపై ప్రశంసల జల్లు కురుస్తున్న రాజేశ్ గురువారం విలేకరులతో మాట్లాడారు. 'నేను ఇప్పటివరకు 350 సినిమాల్లో నటించాను. ఎప్పుడూ ఇలాంటి పాత్రలో నటిస్తానని అనుకోలేదు. నేను సీరియస్ క్యారెక్టర్లో నటిస్తానంటే ఎవ్వరు నమ్మరు. అయినా 'క్షణం' సినిమా ఆ అభిప్రాయాన్ని మార్చింది. నేను కూడా ఇలాంటి పాత్రలో నటించగలననే నమ్మకం కలిగించింది' అని అన్నారు.
'ఈ సినిమాకు ముందు డెరైక్టర్ నన్ను కలిసినప్పుడు నన్ను హీరో స్నేహితుడిగా చేయమని అడుగుతాడనుకున్నాను. కానీ పోలీసు క్యారెక్టర్ చేయమని అనడంతో నేను నమ్మలేక పోయాను. హీరో స్నేహితుడిగానే మొదట చేయాలనుకున్నాను. కానీ 'క్షణం' కథ విన్న తరువాత ఆ పాత్ర చేయాలన్న ఉత్సాహం వచ్చింది' అని చెప్పారు. 'ఈ సినిమాకు నా పాత్రలో సంపత్ రాజ్ నటించాల్సింది. చివరిక్షణంలో నన్ను తీసుకున్నారు. 'క్షణం' రిలీజ్ అయిన్నప్పటి నుంచి ప్రసంశలు వస్తున్నాయి' అని వివరించారు. 'నేను ఈ పాత్రలో నటించినందుకు ఆశ్చర్యపోతున్నామని అభిమానులు ఫోన్లు చేసి చెబుతున్నారు. నా నటన చాలా బాగుందని, సినిమా ఇండ్రస్ట్రీకి మంచి నటుడు దొరికాడని చాలామంది అంటున్నారు' అని రాజేశ్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాత ఒకరు మరో సినిమాలో విలన్ కారెక్టర్లో నటించమని ఆఫర్ ఇచ్చారని, ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.