
‘మది తలపుల పువ్వులు పూస్తే మకరందం నువ్వుసువాసన అనే జ్ఞాపకం పరిమళం చిరుగాలై మనసును తాకితేనీ పిలుపేమో అలికిడి... పులకింత నీ తాకిడి’ (లక్ష్మీపార్వతి రాసిన కవితల్లో ఎన్టీఆర్‌కి ఇష్టమైన కవిత)
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో రామ్‌గోపాల్ వర్మ ఏం చూపించబోతున్నారో విడుదలైతే కానీ తెలీదు. లక్ష్మీపార్వతిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మాత్రం ఆమెలో ‘ఎన్టీఆర్స్ లక్ష్మి’ కనిపించారు.
హైదరాబాద్, ఫిల్మ్‌నగర్‌లోని లక్ష్మీపార్వతి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా శ్రీకృష్ణుడి గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నవ్వుతూ పలకరించింది. ఆ పక్కనే ఒక కుర్చీలో యువకుడిగా ఉన్నప్పటి ఎన్టీఆర్ ఫొటో. గోడలకు మిడిల్ ఏజ్‌లో ఉన్న ఎన్టీఆర్ పెయింటింగ్, మరో వైపు ఎన్టీఆర్ – లక్ష్మీపార్వతి పెళ్లి ఫొటో ఉన్నాయి. ఆ ఇంట్లో ఎటు చూసినా ఎన్టీఆరే. గుంటూరు జిల్లా పొన్నూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది పచ్చల తాడిపఱు.
అది లక్ష్మీపార్వతి సొంతూరు. కృష్ణాజిల్లా, గుడివాడకు పాతిక కిలోమీటర్ల దూరాన ఉంది నిమ్మకూరు. అది ఎన్టీఆర్ సొంతూరు. ఈ రెండు ఊర్లకు మధ్య ఓ మధురమైన బంధం దేశ రాజధాని న్యూఢిల్లీలో మొగ్గ తొడిగింది. ఆ ఆత్మసఖునితో తనకు ఏర్పడిన బాంధవ్యాన్ని, అనంతర కాల జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు లక్ష్మీపార్వతి.
తొలి తలపు సందర్భం
‘‘నా జీవితంలో ముఖ్యమైనవి నాలుగు సంఘటనలు. ఐదేళ్ల వయసులో ‘గులేబ కావళి కథ’ సినిమా చూసేటప్పుడు ఎన్టీఆర్‌ను దగ్గరగా చూడాలని ఏడ్చి మొండికేస్తే మా నాన్న తెర దగ్గరగా కూర్చోపెట్టారట. ఆ సంఘటన లీలగా గుర్తుంది. రెండోది.. స్కూల్లో ఉన్నప్పుడోసారి ఎన్టీఆర్ వస్తున్నారని పిల్లలందరం రోడ్డు మీదకొచ్చాం. మమ్మల్ని చూసి ఆయన దిగి వచ్చి చేతులూపారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కూడా నేను రోడ్డు మీద నుంచి కదల్లేదు. మా టీచర్ వచ్చి చెవి మెలేసి తీసుకెళ్లే వరకు ఆ భ్రాంతిలోనే ఉండిపోయాను. నేను పెద్దయిన తర్వాత మరోసారి ఆ మహానుభావుణ్ని చూసే అవకాశం వచ్చింది. తెనాలిలో మీటింగ్. ఎన్టీఆర్‌గారికి రచయితగా పరిచయం కావాలనే తపన నాది. సభలో చదివి వినిపించడానికి పాట రాసుకుని వెళ్లాను. చాలామంది వచ్చారు. ఉదయం నుంచి ఒక గదిలో కూర్చోబెట్టారు. చెమటకు ముద్దయిపోయాం అందరం.
నా చేతిలోని పాట కాగితం కూడా. ఏడాది పిల్లవాడిని ఇంట్లో అమ్మ దగ్గర పెట్టి వచ్చాను. ఎన్టీఆర్ సాయంత్రం నాలుగ్గంటలకు వచ్చారు, కానీ జనం గుమిగూడిపోవడంతో కంటి నిండా చూడలేకపోయాను. ఆ సమూహంలో కిందకు వంగి చేయి చాచి ఆయన పాదాలు తాకి కళ్లకద్దుకుని వెనక్కి వచ్చేశాను. అది మూడో సంఘటన. ఇక నాలుగోది.. ఢిల్లీలో సంభవించింది. ఎన్టీఆర్‌తో మాట్లాడాలని ఉందని ఉపేంద్ర గారిని అడిగి ఉన్నాను (అప్పటికే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాను). ఆ అవకాశం 1985, నవంబర్ ఒకటిన వచ్చింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కవులు, కళాకారులకు సన్మానం. ఆయన ఎదురుగా సభలో మాట్లాడటంతోపాటు సన్మానం కూడా అని తెలిసినప్పటి నుంచి తిండి తినబుద్ధి కాలేదు, నిద్రపట్టలేదు. తీరా ఆ రోజు ఆయన కనిపించగానే సూర్యభగవానుడే దిగివచ్చినట్లు కళ్లు విభ్రమ చెందాయి. ఆయన కాళ్ల మీద పడిపోయాను. ఆయన నన్ను గుర్తు పెట్టుకున్న తొలి సందర్భం కూడా అదే.
మలుపులో మహద్భాగ్యం
అది 1986, మే నెల.. మహానాడుకు వెళ్లడానికి మహిళల కోసం విడిగా బస్సు వేశారు. అప్పుడు నేను గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి మహిళా విభాగం జనరల్ సెక్రటరీని. మహిళలందరం బస్సులో వెళ్లాం. వేదికకు దగ్గరగా మా సీట్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ని దగ్గరగా చూశాను. సమావేశం పూర్తయింది. బస్సులు కదులుతున్నాయి బస్ ఎక్కమని అనౌన్స్‌మెంట్ వస్తోంది. ఎన్టీఆర్ వేదిక దిగడం, నేను లేచి బస్ కోసం నడవడం అనుకోకుండా ఒకేసారి జరిగాయి. ఉపేంద్రగారు పలకరించడంతో ఆగాను. బారికేడ్‌కు ఆవల ఎన్టీఆర్, ఇవతల నేను. ఆ టర్నింగ్ దగ్గర ఆయన వెళ్లాల్సిన దారి, మా దారి వేరవుతాయి.
ఒక్క క్షణం ముందుగా ఆయన తన దారిలో వెళ్లిపోయినా, నేను ఒక్క క్షణం ఆలస్యంగా సీట్లోంచి లేచినా ఒకరికొకరం ఎదురుపడేవాళ్లమే కాదు. కాకతాళీయంగా జరిగిపోయింది. ఆ టర్నింగ్ నా జీవితాన్నే మలుపు తిప్పింది. అది కూడా ఆయన పుట్టిన రోజు నాడు. ఆయన ఎదురుగా కనిపిస్తే నాకు ఇక ఏమీ తెలిసేది కాదు, వెంటనే కాళ్ల మీద పడిపోయాను. ఆయనే పైకి లేపి... నా ముఖంలోకి చూస్తూ, చూపుడు వేలు చూపిస్తూ ‘లక్ష్మీపార్వతి గారు’ అన్నారు. అంతే మేఘాల్లో తేలిపోయినట్లయింది నాకు.
రచనగా ‘రామ’ చరితం
నేను ఎంఫిల్ చేస్తున్న రోజుల్లో మా కాంటెంపరరీ స్టడీస్ విభాగం ఆంధ్ర సారస్వత పరిషత్ భవనంలో ఉండేది. రోజూ మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో ఎన్టీఆర్ ఇంటికి పరుగు తీసేదాన్ని. ఒక్కోరోజు ఆయన కనిపించేవారు. ‘మీ థీసీస్ ఎంత వరకు వచ్చింది’ అని అడిగేవారు. ఎంఫిల్ పూర్తయిన తర్వాత ఆ సంగతి చెప్పడానికి వెళ్లి, ధైర్యం చేసి ‘మీ బయోగ్రఫీ రాస్తాను’ అని అడిగాను. పెద్దగా నవ్వేశారాయన. ‘మై లైఫ్ ఈజ్ యాన్ ఓషన్’ అన్నారు. జీవితం అంటే పైకి కనిపించే పార్శ్వం మాత్రమే కాదు, దాని వెనుక కష్టాల కోణాలుంటాయనేది ఆయన ఉద్దేశం. ‘నాకు కష్టాలు తెలుసు, కష్టాల్లోనే పెరిగాను, కష్టాల్లోనే బతుకుతున్నాను. కష్టం విలువ తెలుసు’ అన్నాను.
ఆ మాట ఆయనకు నచ్చింది. ఆయన జీవిత చరిత్ర రాయడం కోసం 1985–86 సంవత్సరాల్లో నిమ్మకూరుకు వెళ్లి బంధువులతో మాట్లాడిన సంగతి కూడా చెప్పాను. ఆయనకంటే ముప్పై ఆరేళ్ల చిన్నదాన్ని. నా మాటలు చిన్నపిల్ల చేష్టలా అనిపించినట్లున్నాయి. నా తల మీద చిన్నగా కొట్టి నవ్వారు. కానీ నేను పట్టుదలతో ఉన్నాననే నమ్మకం కలిగిందాయనకు. ఎంఫిల్ అవార్డు అందుకోవడానికి వచ్చినప్పుడు మరోసారి కలిసి బయోగ్రఫీ గురించి గుర్తు చేశాను, అప్పుడు ఒప్పుకున్నారాయన. నర్సరావుపేటలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ వారాంతంలో హైదరాబాద్‌కి వచ్చి బయోగ్రఫీ కోసం నోట్స్ రాసుకున్నాను.
ఊహించని వరం
నేను దేవుడిలా ఆరాధించే రూపం ఎన్టీఆర్. ఆయన కూడా నన్ను అంతలా ఆరాధిస్తున్నారని తెలిసినప్పుడు సంతోషం వేయకుండా ఎలా ఉంటుంది? నాతో మాట్లాడాలనిపించినప్పుడు కాలేజ్‌కి ఫోన్ చేసేవారాయన. కాలేజ్‌కి ఫోన్ చేయడం నాకు ఇబ్బందిగా ఉంటోందని తెలిసి ఇంటికి ఫోన్ పెట్టిం చారు. రోజూ గంటలకు గంటలు మాట్లాడే వారు. ఓసారి హైదరాబాద్‌కి వెళ్లినప్పుడు ఫోన్ బిల్లు చూపించి ‘ఇది మన ప్రేమ ఫలితం’ అని నవ్వారు. బిల్లు చూసి గుండె ఆగినంత పనైంది. రెండు లక్షలకు పైనే. అంతలా ఆరాధిస్తున్న మనిషి∙‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగినప్పుడు నా నోటి నుంచి మరో మాట ఎలా వస్తుంది? ఆయన మనసులో స్థానం పొందడం నా అదృష్టం అని నేననుకుంటూ ఉంటే.. ఓ రోజు ఆయనే ‘లక్ష్మీ! నీ మనసులో నాకు స్థానం లభించడం నా అదృష్టం’ అన్నారు. ‘నువ్వంటే నాకు ప్రేమ కాదు లక్ష్మీ, ఆరాధన’ అనేవారు. వేటూరి గారి సన్మాన సభలో నా ప్రసంగానికి ప్రశంసలు వచ్చాయి.
అప్పుడు ఎన్టీఆర్ సభలో మిగిలిన వారితో ‘అందుకే ఆమె అంటే నాకంతటి ఆరాధన. విద్వత్తుకు మరేదీ సాటి రాదు’ అన్నారు. భార్యలో మంచి లక్షణాన్ని అంగీకరించడం గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్లకే సాధ్యం. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి సంక్షోభంలో పడినప్పుడు కూడా ఆయన నాకు అండగా నిలిచారు. కుటుంబం అంతా ప్లాన్ చేయడంతో కంచి పీఠాధిపతి నుంచి ఫోన్ వచ్చింది. నేను పుట్టింటికి కానీ కంచి ఆశ్రమానికి కానీ వెళ్లిపోతే ఆయనకు ముఖ్యమంత్రి పదవి మళ్లీ ఇచ్చేస్తామన్నారు. అప్పుడు కూడా నా గౌరవాన్ని తగ్గనివ్వలేదాయన. నాకే కాదు, పెద్దావిడను కూడా గొప్పగా గౌరవించేవారు. ఆమెను తలుచుకుంటూ ఆయనకు తెలియకుండా ఉమ్మడి కుటుంబంలో ఆమెకు జరిగిన అన్యాయాలు, ఆయన దృష్టికి వచ్చిన తర్వాత పరిష్కరించిన సంఘటనలను నాతో పంచుకునే వారు. సినిమా షూటింగులతో ఆమెకు తగినంత సమయం ఇవ్వలేకపోయానని, కొన్ని సినిమాలను తగ్గించుకుని ఉండాల్సింది అని బాధపడేవారు.
జ్ఞాపకాలే సర్వస్వం
పదో ఏట నుంచి కష్టాలనే చూశాను. అన్ని కష్టాల్లో నాకు సాంత్వననిచ్చింది ఆధ్యాత్మిక మార్గమే. తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో కూడా నా ఉపన్యాసం ఉండేది. ఎన్టీఆర్ ముగ్ధులైపోయింది కూడా ఆ శ్లోకాల పఠనానికే. ఆయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. కానీ సంస్కృతం రాదు. సంస్కృతం వచ్చిన నన్ను భాగస్వామిని చేసుకుని ఆయన ఆ లోటును పరిపూర్ణం చేసుకున్నారు. నా చేత ఆ శ్లోకాలను మళ్లీ మళ్లీ చదివించుకుని, భాష్యం చెప్పించుకుని ఆనందించేవారు. ఇప్పటికీ నన్ను నడిపిస్తున్న శక్తి తరంగాలు ఆయన జ్ఞాపకాలే. నా కొడుకు కోటేశ్వర ప్రసాద్, కోడలు దేవ స్మిత ఇద్దరూ డాక్టర్లు. వాళ్లను చూసుకుంటూ, నా స్వామి స్మరణంలో కాలం గడుపుతున్నాను’’.
– ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి
పిల్లలకు చెప్పారు
నన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్న తర్వాత ఆ సంగతి కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు... అందరినీ పిలిచి ‘ఈ వయసులో నా ఆరోగ్యాన్ని పట్టించుకునే సహచరి కావాలి. ఆమె అభిరుచులు నా ఇష్టాలు సరిపోతు న్నాయి. నాకు ఆమె పట్ల గౌరవం ఉంది’ అని చెప్పారు. అంతా విని రామకృష్ణ ‘పెళ్లి తర్వాత మేము ఇంటికి రావచ్చా’ అని అడిగారు. అప్పుడు ఎన్టీఆర్ ‘తప్పకుండా రావచ్చు, రావాలి కూడా’ అన్నారు. మా వివాహానికి కుటుంబ అంగీకారమే కాదు, సమాజ ఆమోదం కూడా ఉంది. ఆయనకు బ్రెయిన్‌లో క్లాట్ ఏర్పడి, పెరాలసిస్ వచ్చిందని ఇంట్లో అందరికీ తెలుసు. ఆయన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టలేదెవ్వరూ. ఆయన కడుపున పుట్టడం వాళ్ల అదృష్టం. ఆయన్ని కాపాడుకోవాలనే ఆలోచనే లేదెవ్వరికీ. క్షోభకు గురి చేయకుండా బతకనిచ్చి ఉంటే ఆయన్ని మరో పదేళ్లు కాపాడుకునేదాన్ని.
‘నీ చేతి వంట కోసమే బతకాలి’
నేను టీ తాగను, టీ పెట్టడమూ రాదు. ఆయనే టీ పెట్టడం నేర్పించారు. ఆయనకు నచ్చినట్లు వంట చేయాలని వంటల పుస్తకాలు తెప్పించుకున్నాను. సూర్యకాంతమ్మగారి వంటల పుస్తకం చూస్తూ వారంలో వంట నేర్చుకున్నాను. తర్వాత నా వంట తింటూ ‘నీ చేతి వంట కోసమే నూరేళ్లు బతకాలనుంది లక్ష్మీ’ అనేవారు. సి.ఎం అయిన తర్వాత ఆరుగురు వంటవాళ్లున్నా సరే... ‘లక్ష్మీ నువ్వేం వండావు’ అని అడిగి, అదే తినేవారు. నేషనల్ ఫ్రంట్ లీడర్లు హైదరాబాద్‌కి వచ్చినప్పుడు కూడా ‘నువ్వేదయినా చేసిపెట్టు’ అన్నారు. నేను చేసిన గారెలు, బజ్జీలను ‘మా తెలుగు వంటకాల రుచి ఎలా ఉంది’ అంటూ వాళ్లకు కొసరి కొసరి పెట్టించారు.
అది చాలా చిన్న తిట్టు
లక్ష్మీస్ ఎన్‌టీఆర్ టీజర్‌లో నన్ను తిడుతూ కొట్టిన పై సన్నివేశం కరెక్టే. అది చాలా చిన్న తిట్టు. మాటల్లో చెప్పలేని అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. రామ్‌గోపాల్ వర్మతో ఎన్‌టీఆర్ జీవితం మొత్తం చెప్పడానికి కుదరలేదు. నేను రాసిన బయోగ్రఫీ రెండు భాగాలు (ఎదురు లేని మనిషి, తెలుగుతేజం) ఇచ్చాను. వర్మగారు ఎన్టీఆర్‌తో పని చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను సంప్రదించి సమాచారం సేకరించారు. సొంతంగా అధ్యయనం చేసి మరీ తీశారు. నేను నీలిరంగు చీరలో ఉన్న ఫొటో అసలుదే. అది నా దగ్గర లేదు. ఆయనెలా సంపాదించారో తెలియదు. ఇరవై మూడేళ్ల నా అంతర్మధనం దృశ్యరూపం సంతరించుకుంటోంది. చరిత్రను, వాస్తవాన్ని ఎంత లోతున పాతి పెట్టాలని చూసినా ఏదో ఒక రోజు అవి ఉవ్వెత్తున ఎగిసి పడతాయి.
‘ఎంత బాగున్నావో!’
ఓ రోజు... రవీంద్రభారతికి వెళ్లడానికి బస్సు దిగి రోడ్డు దాటుతున్నాను. ఓ కారు నా దగ్గరగా వచ్చి ఆగింది. ఆ కారులో ఎన్టీఆర్! అబిడ్స్ నుంచి వస్తున్నారు. ఓ క్షణం ఆగి చూసి వెళ్లిపోయారు. అప్పుడు నేను గాలికి రేగిపోయి ముఖాన పడుతున్న జుత్తును చేత్తో వెనక్కి తోసుకుంటూ కొంగు భుజాన కప్పుకుని తల పక్కకు తిప్పి చూశానట. ‘ఆ దృశ్యం ఇప్పటికీ ఫొటోలాగ నా మదిలో ముద్రించుకుపోయింది లక్ష్మీ. అప్పుడే నిన్ను కారులో ఎక్కించుకుని నాతో తీసుకెళ్లి పోవాలనిపించింది. ఆ రోజు పసుపురంగు చీరలో చాలా బాగున్నావు’ అని చాలా రోజులకు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పారాయన.
Comments
Please login to add a commentAdd a comment