గుండె లోతుల్లో నుంచి అనిపిస్తేనే...
హిందీ చలనచిత్ర సీమలో ఇటీవల అందరినీ ఆకర్షిస్తున్న నటి - సోనాక్షీ సిన్హా. ఇప్పటి వరకు ఆమె నటించిన చిత్రాల్లో వంద కోట్ల వసూళ్ళు సాధించిన ‘మసాలా’ సినిమాలు అనేకం. సల్మాన్ ఖాన్ ‘దబంగ్’ (తెలుగు ‘గబ్బర్ సింగ్’కు మాతృక)తో సినీ రంగానికి వచ్చిన ఆమె ఆ తరువాత వరుసగా ‘రౌడీ రాథోడ్’, ‘బుల్లెట్ రాజా’, ‘ఆర్... రాజ్‌కుమార్’, ‘దబంగ్ 2’, ‘సన్ ఆఫ్ సర్దార్’ చిత్రాల్లో అలరించారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చే నెల మొదటి వారంలో రానున్న ‘హాలీడే - ఎ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ’ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన ఆమె కనిపించనున్నారు.
ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హాకు కుమార్తె అయిన సోనాక్షి అదృష్టం ఇప్పుడు ఎంతలా ఉందంటే, ఆమె ఏ సినిమాలో నటిస్తే అది వసూళ్ళ వాన కురిపిస్తోంది. ఇక, ఆమె ఇమేజ్ ఎంత వరకు పాకిందంటే, చివరకు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రజనీకాంత్ కొత్త సినిమా ‘లింగ’లో కూడా ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నారు. బాక్సాఫీస్ వసూళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టే సినీ రంగంలో సోనాక్షీ సిన్హా ఇప్పుడు అభినయ ప్రధాన చిత్రాల వైపు మొగ్గుచూపుతున్నారు. ‘‘ఓ పక్కన వంద కోట్లు వసూలు చేసే భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూనే, మరో పక్కన ‘లూటేరా’ లాంటి అభినయ ప్రధాన చిత్రాలు చేయాలని ఉంది. ఈ రెంటికీ మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నా’’ అని సోనాక్షి తన మనసులో మాట వెల్లడించారు.
‘‘నా మటుకు నాకు ‘లూటేరా’ లాంటి మరిన్ని సినిమాల్లో నటించాలని ఉంది. కానీ, అలాంటి సమగ్రమైన స్క్రిప్టులు చాలా అరుదుగా వస్తాయి. అందుకే, ఇప్పుడు ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నా. స్క్రిప్టు వినగానే, ఈ సినిమా చేయాలని నా గుండె లోతుల్లో నుంచి అనిపిస్తేనే, ఓకే చెబుతున్నా’’ అని ఆమె వివరించారు. ‘‘అలాగని మసాలా సినిమాలంటే నాకు ద్వేషమేమీ లేదు. వాటిని చూడడమన్నా, అందులో నటించడమన్నా ఇష్టమే. కాకపోతే, వాటికీ, అభినయ ప్రధాన చిత్రాలకూ మధ్య సమతూకం పాటించాలనే నా తపన’’ అన్నారామె. రానున్న ‘హాలీడే’ చిత్రంలో పట్టణ ప్రాంత కాలేజీ అమ్మాయిగా నటిస్తున్న ఆమె... కథలో భాగంగా బాక్సర్‌గా కనిపిస్తారు.
బడిలో చదువుకొనే రోజుల నుంచి ఆటలన్నా, అందులోనూ బాక్సింగ్ క్రీడ అన్నా ఇష్టమైన సోనాక్షి ఈ సీరియస్ థ్రిల్లింగ్ చిత్రంలోని తన పాత్ర మనసుకు ఎంతో నచ్చిందన్నారు. అన్నట్లు ఈ పాత్రపోషణ కోసం ప్రముఖ భారతీయ బాక్సింగ్ యోధుడు విజేందర్ సింగ్ నుంచి కొన్ని మెలకువలు కూడా నేర్చుకున్నారు. ఆ సంగతి ఆమె ఆనందంగా చెప్పారు. ఎంతైనా... మనసుకు నచ్చిన పాత్ర, సినిమా వస్తే ఏ నటికైనా, నటుడికైనా అంతకన్నా ఇంకేం కావాలి!