బాహుబలి ఖాతాలో మరో రికార్డ్
దక్షిణాది సినిమాలను ఉత్తరాది వారు చిన్న చూపు చూస్తారన్న వాదన ఎప్పటినుంచో ఉంది. అందుకే జాతీయ వేదికల మీద తెలుగు సినిమాలకు సముచిత స్థానం దక్కటంలేదంటారు. అయితే ఇదంతా గతం.. బాహుబలి సినిమాతో సీన్ మారిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమా కలెక్షన్ స్టామినా అంతర్జాతీయ స్థాయికి చేరింది. రీజినల్ సినిమా కూడా బాలీవుడ్ రికార్డ్ లను సవాల్ చేయగలదని తెలిసిపోయింది. తెలుగు సినిమాగా స్టార్ట్ అయిన బాహుబలి జాతీయ చిత్రంగా ఇండియన్ సినిమాను అంతర్జాతీయ వేదికల మీద నిలబెట్టింది.
ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు సాధించిన బాహుబలి ఖాతాలో ఇప్పుడు మరో అరుదైన ఘనత వచ్చి చేరింది. ఈ దశాబ్ద కాలంలో అత్యధిక మంది ఆన్ లైన్ లో సెర్చ్ చేసిన సినిమాల జాబితా బాహుబలి స్థానం సంపాదించింది. ఈ లిస్ట్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పికె తొలి స్థానం సాధించగా.. లేడి ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన కహాని రెండో స్థానంలో నిలిచింది. ఇక తెలుగు దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి మూడో స్థానంలో నిలబడి దక్షిణాది సినిమా స్థాయిని ప్రపంచానికి చాటింది.
అత్యధిక మంది సెర్చ్ చేసిన హీరోల జాబితాలో సల్మాన్ ఖాన్ తొలి స్థానంలో నిలవగా షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ లు తరువాతి స్థానాలను సాధించారు. హీరోయిన్ల జాబితాలో సన్నిలియోన్ తొలి స్థానంలో నిలవగా కత్రినాకైఫ్, కరీనా కపూర్ లు తరువాతి స్థానాలను సాధించారు. సౌత్ స్టార్ కాజల్ అగర్వాల్ కు ఈ లిస్ట్ లో నాలుగో స్ధానం దక్కటం మరో విశేషం.