
ఫోన్‌లోనే కథ విని ఓకే చెప్పిన నిర్మాత
ఇవాళ కథ చెప్పి నిర్మాతను ఒప్పించడం దర్శకుడికి అంత సులభం కాదు. అలాంటిది తన కథను ఫోన్‌లో చెప్పి నిర్మాతను సంతృప్తిని కలిగించి చిత్రాన్ని పూర్తి చేశారు దర్శకుడు కామ్రన్. ఈయన కథ,కథనం,మాటలు,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన చిత్రం నవరసతిలగమ్. ఇంతకు ముందు బర్మా చిత్రాన్ని నిర్మించిన స్కోయర్ స్టోన్ ఫిలింస్ అధినేత సుదర్శన్ వెంబుట్టి కే.జయచందర్‌రావుతో కలిసి నిర్మిస్తున్న చిత్రం నవరసతిలగమ్.
మాకాపా.ఆనంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జంటగా నటి సృష్టి డాంగే నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో కరుణాకరన్, జయప్రకాశ్, ఇళవరసు, పావా లక్ష్మణన్, మీరాక్రిష్ణన్, లక్ష్మి, మహదేవన్ నటించారు. ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా, వల్లవనుక్కుమ్ పుల్లుం ఆయుధమ్ చిత్రాల ఫేమ్ సంగీత దర్శకుడు సిద్ధార్థ్ విపిన్ ఈ చిత్రం ద్వారా నటుడిగా పరిచయం కావడం విశేషం.
ఇందులో ఆయన ఒక ముఖ్య పాత్రను పోషించారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ కథా చిత్రం అని చెప్పారు. హీరో తన తండ్రి సంపాదించిన డబ్బునంతా రియల్ ఎస్టేట్‌లో పోగొట్టుకోవడంతో పాటు తన స్నేహితుడు కరుణాకరన్ డబ్బును అదే వ్యాపారంలో పెడతారన్నారు. ఈ డబ్బుతో అయినా సక్సెస్ అయ్యాడా?లేదా? అన్నదే చిత్రం ఇతి వృత్తం అన్నారు.
ఈ చిత్ర కథను విదేశాల్లో ఉన్న నిర్మాత సుదర్శన్ వెంబుట్టికి ఫోన్‌లోనే మూడు గంటల పాటు వినిపించినట్లు తెలిపారు.అలా ఫోన్‌లోనే కథ విని చిత్రం చేసిన తొలి నిర్మాత ఆయనే అవుతారని,అదే విధంగా ఫోన్‌లోనే కథ చెప్పి నిర్మాతకు సంతృప్తిని కలిగించి దర్శకత్వం వహించిన తొలి దర్శకుడిని తానే అవుతానని అన్నారు.నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ నవరసతిలగమ్ చిత్రాన్ని ఈ నెల 19న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.