– ‘మా’ జనరల్ సెక్రటరీ శివాజీ రాజా
‘‘గత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మేం 10 శాతం హామీలిచ్చాం. కానీ, కళాకారుల సంక్షేమానికి 100 శాతం కృషి చేశాం. ఇది ‘మా’ సభ్యుల సహకారంతో సాధ్యమైంది. ఇకపై ఏ కళాకారుడూ బాధపడకూడదు. ఏదైనా ఆపద వస్తే ‘మా’ ఉందనే ధైర్యంతో గుండెపై చేయి వేసుకుని ధైర్యంగా బ్రతకాలి’’ అని ‘మా’ జనరల్ సెక్రటరీ శివాజీ రాజా అన్నారు. ప్రస్తుత ‘మా’ కమిటీ రెండేళ్ల గడువు ముగియడంతో హైదరాబాద్‌లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
‘మా’ జాయింట్ సెక్రటరీ నరేశ్ మాట్లాడుతూ– ‘‘గత ఎన్నికల్లో ‘మా’లో రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేశాం. ‘ప్రస్తుత కమిటీ బాగా పనిచేస్తోంది. ఈసారి పోటీ లేకుండా కొత్త కమిటీ ఎన్నికకు కృషి చేస్తానని’ దాసరి నారాయణరావుగారు అన్నారు. కొత్త అధ్యక్షునిగా శివాజీరాజా, జనరల్ సెక్రటరీగా నా పేరు ‘మా’ కమిటీ, ఈ.సీ. మెంబర్లు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. త్వరలో పూర్తి వివరాలు చెబుతాం’’ అన్నారు. ‘మా’ వైస్ ప్రెసిడెంట్ శివకృష్ణ, ఈ.సీ. మెంబర్లు గీతాంజలి, ఏడిద శ్రీరాం, గౌతమ్ రాజు, హరనాథ్ బాబు, హేమ, జయలక్ష్మి, మానిక్, నర్సింగ్ యాదవ్, సురేశ్ కొండేటి, పి.శ్రీనివాసులు, శ్రీ శశాంక తదితరులు పాల్గొన్నారు.