సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోషియేన్ వివాదం మరింత ముదురుతోంది. నరేష్, శివాజీ రాజల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ఫలితాలతో వివాదానికి తెరపడుతుందని భావించినా అలా జరగలేదు. ఎలక్షన్లలో శివాజీ రాజా ప్యానల్‌పై నరేష్ ప్యానల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే గెలిచిన వర్గం ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయాలని భావించినా శివాజీ రాజా అడ్డుపడుతున్నాడంటూ ఆరోపిస్తూ నరేష్ వర్గం మీడియా ముందుకు వచ్చారు.
(చదవండి : ‘మా’లో మరో వివాదం)
అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన శివాజీ రాజా ‘బైలా ప్రకారం ఏప్రిల్‌లో ప్రమాణ స్వీకారం చేయాలని సూచించాను. గతంలో నేను కూడా 25 రోజులు ఆగి ప్రమాణం చేశాను అంతేగాని వారి ప్రమాణం సీక్వారంపై నేను కోర్టుకు వెళతానని చెప్పలేదు’ అన్నారు. ఈ సందర్భంగా శివాజీ రాజా పలు ఆరోపణలు చేశారు. గతంలో మా చాలా బాగుండేది అన్న శివాజీ గత నాలుగేళ్లుగా రాజకీయాలు ప్రవేశించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
‘గత 22 ఏళ్లుగా మాలో ఎన్నో పదువుల్లో సేవ చేశాను, ఈసీ మెంబర్ నుంచి అధ్యక్షుడి వరకు అన్ని బాధ్యతలు నిర్వహించాను. ఇప్పుడు నాకు కుర్చీ మీద వ్యామోహం లేదు. కానీ నరేష్ వర్గం ప్రెస్‌మీట్ పెట్టి మా పరువు బజారు కీడ్చటం బాధకలిగించింది. అందుకే నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అమెరికా ఈవెంట్ సందర్భంగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు చేయటం సరికాదు. ఆ ఈవెంట్‌పై చిరంజీవి అధ్యక్షతన వేసిన కమిటీ క్లీన్ చీట్ ఇచ్చింది.
(చదవండి : ‘మా’ అధ్యక్షుడిగా నరేష్ విజయం)
ఫిలిం స్టార్స్‌ను బిజినెస్ క్లాస్‌లో తీసుకెళ్లామనటం కూడా కరెక్ట్ కాదు. గతంలో నరేష్ కూడా పలు తమిళ నటీనటుల సంఘం ఈవెంట్ కు బిజినెస్ క్లాస్‌లో వెళ్లి సూట్ రూమ్‌లో స్టే చేశారు. తారలకు సముచిత గౌరవం ఇవ్వటం ధర్మం అందుకే బిజినెస్ క్లాస్‌లో తీసుకెళ్లాం. ఇన్నేళ్లల్లో నరేష్ మాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ప్రతీసారి మా అమ్మ(విజయ నిర్మల) 15 ఇస్తున్నారు అంటారు. ఆ 15 వేలతోనే మా నడుస్తుందా?
ఎన్నికల సమయంలో తప్పులు జరిగాయి. నారాయణరావు అనే వ్యక్తి అక్కడే జీవితకు ఓటేయండి అంటూ మైకులో చెప్తున్నారు. అయినా నేను ఆరోపణలు చేయలేదు. జీవితా రాజశేఖర్‌లు అన్ని పార్టీలు మారారు.. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ మీద పడ్డారు. శ్రీరెడ్డి, డ్రగ్స్ విషయంలో నేను సరిగ్గా స్పందించలేదని జీవిత గతంలో అడిగారు. కానీ శ్రీరెడ్డి విషయంలో కార్డు ఇవ్వమని కొందరు, ఇవ్వొద్దని కొందరు అన్నారు, అందుకే ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయాం.
మా డైరీ ప్రింటింగ్ సమయంలో నరేష్ ఈ సారి తాను ప్రింట్ చేయిస్తానని బాధ్యత తీసుకున్నాడు. 14 లక్షలు ప్రింటింగ్ కోసం కలెక్ట్ అయినట్టుగా వెల్లడించారు. కానీ అకౌంట్‌లో 7 లక్షలు మాత్రమే జమ అయ్యాయి. మిగతా 7 లక్షలు ఏమయ్యాయి. ఎప్పుడు వస్తాయి. అవి జమ చేసి ప్రమాణం చేస్తే బాగుంటుంది. తప్పులు వాళ్లు చేసి అవతలి వాళ్లు వేదనకు గురి చేయటం కరెక్ట్ కాదు’ అన్నారు శివాజీ రాజా.
ఎన్నికల కొద్ది రోజుల ముందు నాగబాబు ప్రెస్‌మీట్ పెట్టి నరేష్ వర్గానికి మద్దుతు తెలపటంపై స్పందించిన శివాజీ రాజా ‘నాగాబాబు నేను చాలా ఏళ్లుగా మంచి స్నేహితులం.. నాగబాబు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, త్వరలోనే నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా’ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment