సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మా జనరల్ సెక్రటరీ, సీనియర్ నటుడు నరేశ్ స్పందించారు. ‘మా’ లో నిధుల దుర్వినియోగం జరిగింది వాస్తమేనన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినందు వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు శివాజీరాజా సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తాను ఎవరిపై ఫిర్యాదు చేయాలనుకోవడం లేదని.. కానీ ధర్మం కోసం పోరాడక తప్పదని పేర్కొన్నారు. ‘మా’ అధ్యక్షుడు ప్రవర్తిసున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నరేశ్.. తాను అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నానని తెలిపారు.
నిజనిర్ధారణ కమిటీకి అంగీకరించడం లేదు..
‘మా’ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న తనకు శివాజీరాజా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని నరేశ్ ఆరోపించారు. ఏప్రిల్ నుంచి శివాజీరాజా తన ఫోన్ కట్ చేసాడంటూ... ఆయనకు సంబంధించిన కాల్, మెసేజ్ డాటాను బయటపెట్టారు. నిజాలు నిర్భయంగా మాట్లాడుతాను కాబట్టే తనను దూరం పెడుతున్నారని ఆరోపించారు. మాలో చోటుచేసుకున్న ఈ వివాదంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారితో నిజనిర్ధాణ కమిటీ వేయాలని తాను చెప్పానని.. అయితే శివాజీరాజా మాత్రం అందుకు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి కూడా తీసుకువెళ్లానన్నారు.
మూడు లక్షలు ఖర్చు చేసి...
విదేశీ కార్యక్రమాల గురించి శివాజీరాజా తనకు ఎటువంటి వివరాలు చెప్పలేదని నరేశ్ ఆరోపించారు. అమెరికా ఈవెంట్ కోసం శివాజీరాజాతో సహా మరికొందరు బిజినెస్ క్లాస్‌లో 3 లక్షలు చెల్లించి మరీ ప్రయాణం చేశారని.. ఆ డబ్బంతా ఎవరిదంటూ ప్రశ్నించారు. తప్పు జరిగినందువల్లే తాను ఫారిన్ టూర్లకు వెళ్లడం లేదని ఆయన పేర్కొన్నారు. మా తరపున క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన విషయం కూడా తనకు తెలియదని వాపోయారు. సెక్రటరీగా ఉన్న తనకు అసలు ఎటువంటి విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నమ్రత నాకు కాల్ చేశారు..
మా మీటింగ్ లో జరిగే ప్రతి మాట రికార్డ్ అవుతుందని చెప్పారు.. కానీ సంవత్సరం నుంచి రికార్డులు అన్ని తీసివేశారని నరేశ్ ఆరోపించారు. మహేష్ బాబు ప్రోగ్రాం కోసం తానే శివాజీరాజాను నమ్రత దగ్గరకు తీసుకు వెళ్ళానని నరేశ్ అన్నారు. తాను అడిగినందువల్లే ఆ ప్రోగ్రాం ఫిక్స్ అయిందని పేర్కొన్నారు. కానీ ఆ తరువాత నుంచి వేరే వాళ్ల నుంచి నమ్రతకు కాల్స్ వస్తోంటే.. నమ్రత తనకు కాల్ చేశారని నరేశ్ పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ గమనిస్తుంటే తనను కావాలనే తప్పించడానికి చేసిన ప్రయత్నంగా అనిపించిందని నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను మనస్తాపం చెందానని... వచ్చే ఎన్నికల్లో పోటీచేయదలచుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment