‘‘డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాను. నేను గొప్ప నటుడు కావాలనేది మా అమ్మ (దివంగత నటి–దర్శకురాలు విజయ నిర్మల) కోరిక. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు (బాలనటుడిగానూ చేశారు) అవుతున్నా ఇప్పటికీ బిజీగా ఉండటం నా అదృష్టం. ‘శ్రీదేవి సోడా సెంటర్’లో నేను చేసిన పాత్ర గొప్పది.. ఇప్పుడు మా అమ్మ ఆత్మ సంతోషంగా ఉంటుందనుకుంటున్నాను’’ అన్నారు వీకే నరేశ్. సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 27న విడుదలైంది.
ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన వీకే నరేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ నేను 200 సినిమాల్లో నటించాను. అయితే ‘శ్రీదేవి సోడా సెంటర్’లోని పాత్ర నా గత చిత్రాలను మించిపోయింది. విలన్ పాత్రలకు కూడా నరేశ్‌ని తీసుకోవచ్చనే ఆలోచన ఇండస్ట్రీ వర్గాల్లో రేకెత్తించింది. సినిమా చూసిన కృష్ణ (సూపర్ స్టార్ కృష్ణ)గారు.. ‘నువ్వు, సుధీర్ ఈ సినిమాకు ప్రాణం పోశారు.. నీ పాత్ర నాకు కన్నీరు తెప్పించింది’ అనడంతో నాకు కన్నీళ్లొచ్చాయి. కరుణ కుమార్ పెద్ద దర్శకుడు అవుతాడు. రామానాయుడుగారిలా మంచి అభిరుచి, ప్యాషన్ ఉన్న నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడి’’ అన్నారు.
మా ఎన్నికల్లో కృష్ణుడి పాత్ర!
రానున్న ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో నేను కృష్ణుడి పాత్ర పోషిస్తా. ఎన్నికలు ప్రకటించిన తర్వాత రథం ఎక్కుతా.. అది ఎవరి రథం అన్నది తర్వాత చెబుతా. నేను ఒక్కసారి మాత్రమే అధ్యక్షునిగా పని చేస్తానని గతంలో చెప్పా.. రానున్న ఎన్నికల్లో మరోసారి పోటీ చేయను.. నా విజన్‌ని ముందుకు తీసుకెళ్లగలిగే వారసుణ్ణి మాత్రం ‘మా’ కు అందిస్తా.
Comments
Please login to add a commentAdd a comment