జుహీచావ్లా
గులాబీగ్యాంగ్‌లో విలన్ తరహా పాత్ర పోషించాలని చెప్పగానే దర్శకుడు సౌమిక్ సేన్ వెర్రివాడేమో అనుకున్నానంటూ నవ్వేసింది జుహీచావ్లా. ‘మొదటిసారి ఈ పాత్ర గురించి విన్నప్పుడు సేన్‌కు ఏదో అయిందనిపించింది. అయితే ఆయన పూర్తిగా కథ వినిపించగానే పాత్ర గొప్పదనం అర్థమయింది’ అని వివరించింది. గులాబ్‌గ్యాంగ్ ప్రచారం కోసం ఢిల్లీలో మంగళవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది. ఈ ఈ పాత్రకు జుహీని ఒప్పించడానికి ఎన్నో తిప్పలు పడ్డానని దర్శకుడు సౌమిక్ సేన్ అన్నాడు.
అనుభవ్ సిన్హా నిర్మించిన ఈ సినిమాలో మాధురి దీక్షిత్ దూకుడు స్వభావమున్న నాయకురాలిగా కనిపిస్తుంది. అధికారదాహం కోసం తహతహలాడే రాజకీయ నాయకురాలి పాత్ర జుహీది. ‘సినిమా కొత్త తరహాలో ఉండాలనే ఆలోచనతోనే ఆమెకు విలన్ పాత్ర ఇచ్చాం. నాయకురాలిగా మాధురినే చూపించాలని మొదటి నుంచి అనుకున్నాం. విలన్ కూడా పెద్ద నటి అయి ఉండాలని కోరుకున్నాం’ అని సేన్ వివరించాడు. సంపత్ పాల్ అనే మహిళ నిజజీవితం అధారంగా ఈ సినిమా కథను రాసుకున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. సినిమా టైటిళ్లలో ఆమె పేరు ఎందుకు వేయలేదన్న ప్రశ్నకు దర్శకుడు బదులిస్తూ తాము రాసుకున్నది పూర్తిగా కాల్పనిక కథ అని, పాల్ జీవితంతో ఎలాంటి సంబంధమూ లేదని వివరించాడు.
మహిళా సాధికారత ప్రాధాన్యం గురించి గులాబ్‌గ్యాంగ్ గొప్ప సందేశం ఇస్తుందని మాధురి ఈ సందర్భంగా చెప్పింది. ప్రతి ఒక్క మహిళ చదువుకొని, సమాజంలో తగిన గౌరవం పొందాలన్నదే సినిమా సారాంశమని తెలిపింది. తన సాటి స్త్రీల బాగు కోసం పోరాడే రజ్జోగా మాధురి ఇందులో కనిపిస్తుంది. గులాబ్‌గ్యాంగ్ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా, హైకోర్టు స్టే విధించింది. సంపత్‌పాల్ పిటిషన్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తన జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారని, కొన్ని సన్నివేశాలు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉన్నందున విడుదలపై స్టే విధించాలని సంపత్ కోర్టును కోరింది.