Gulaab Gang
-
మధురంగా పాడారట
‘ఏక్ దో తీన్..’ అంటూ బాలీవుడ్‌ను తన స్టెప్స్‌తో మాధురీ దీక్షిత్ మైమరిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మాధురి డ్యాన్స్‌కు తిరుగులేదు. లేటెస్ట్గా మాధురి తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చారు. సింగర్‌గా ఓ ఇంగ్లీష్ ఆల్బమ్ పాడారామె. తన తొలి ఆల్బమ్ గురించి మాధురీ దీక్షిత్ మాట్లాడుతూ – ‘‘ప్రొఫెషనల్ లెవల్లో సింగర్‌గా ట్రై చేయడం ఇదే మొదటిసారి. ఆల్రెడీ సాంగ్స్ రికార్డింగ్ పూర్తయింది. ఇక ఆ పాటలకు సంబంధించి వీడియో షూట్ చేయాలి. ఫస్ట్ సింగిల్‌ను ఈ ఏడాది రిలీజ్ చేస్తాం. ఆల్బమ్ పాప్ మ్యూజిక్ స్టైల్లో సాగుతుంది. మొత్తం ఆరు పాటలుంటాయి. ప్రతీ పాట డిఫరెంట్ ఫ్లేవర్‌లో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 2014లో తాను నటించిన ‘గులాబ్ గ్యాంగ్’ సినిమా కోసం ఓ పాటలో తన గొంతుని వినిపించారు మాధురి. అన్నట్లు.. మాధురి పాడిన పాటలను ఆమె సన్నిహితులు విని, ‘చాలా మధురంగా పాడావు’ అని కితాబులిచ్చారట. -
'గులాబ్ గ్యాంగ్'కు తొలిగిన ఇబ్బందులు, రేపు విడుదల
మాధురీ దీక్షిత్, జూహీ చావ్లా నటించిన గులాబ్ గ్యాంగ్ చిత్ర విడుదలకు అడ్డంకులు తొలిగాయి. గులాబ్ గ్యాంగ్ చిత్ర విడుదలపై ఉన్న స్టే ను ఢిల్లీ హైకోర్టు ఎత్తివేయడంతో శుక్రవారం (మే 8 తేదిన) విడుదల కానుంది. గురువారం ఉదయం గులాబ్ గ్యాంగ్ చిత్ర నిర్మాతలు విడుదలపై విధించిన స్టే తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాతల పిటిషన్ కు సానుకూలంగా స్పందించిన కోర్టు.. మధ్నాహ్నం విచారణ చేపట్టింది. నిర్మాతల పిటిషన్ పై వాదోపవాదనలు విన్న కోర్టు విడుదలపై ఉన్నస్టే ను ఎత్తి వేసింది. దాంతో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అతడు వెర్రోడేమో అనుకున్నా..
గులాబీగ్యాంగ్‌లో విలన్ తరహా పాత్ర పోషించాలని చెప్పగానే దర్శకుడు సౌమిక్ సేన్ వెర్రివాడేమో అనుకున్నానంటూ నవ్వేసింది జుహీచావ్లా. ‘మొదటిసారి ఈ పాత్ర గురించి విన్నప్పుడు సేన్‌కు ఏదో అయిందనిపించింది. అయితే ఆయన పూర్తిగా కథ వినిపించగానే పాత్ర గొప్పదనం అర్థమయింది’ అని వివరించింది. గులాబ్‌గ్యాంగ్ ప్రచారం కోసం ఢిల్లీలో మంగళవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది. ఈ ఈ పాత్రకు జుహీని ఒప్పించడానికి ఎన్నో తిప్పలు పడ్డానని దర్శకుడు సౌమిక్ సేన్ అన్నాడు. అనుభవ్ సిన్హా నిర్మించిన ఈ సినిమాలో మాధురి దీక్షిత్ దూకుడు స్వభావమున్న నాయకురాలిగా కనిపిస్తుంది. అధికారదాహం కోసం తహతహలాడే రాజకీయ నాయకురాలి పాత్ర జుహీది. ‘సినిమా కొత్త తరహాలో ఉండాలనే ఆలోచనతోనే ఆమెకు విలన్ పాత్ర ఇచ్చాం. నాయకురాలిగా మాధురినే చూపించాలని మొదటి నుంచి అనుకున్నాం. విలన్ కూడా పెద్ద నటి అయి ఉండాలని కోరుకున్నాం’ అని సేన్ వివరించాడు. సంపత్ పాల్ అనే మహిళ నిజజీవితం అధారంగా ఈ సినిమా కథను రాసుకున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. సినిమా టైటిళ్లలో ఆమె పేరు ఎందుకు వేయలేదన్న ప్రశ్నకు దర్శకుడు బదులిస్తూ తాము రాసుకున్నది పూర్తిగా కాల్పనిక కథ అని, పాల్ జీవితంతో ఎలాంటి సంబంధమూ లేదని వివరించాడు. మహిళా సాధికారత ప్రాధాన్యం గురించి గులాబ్‌గ్యాంగ్ గొప్ప సందేశం ఇస్తుందని మాధురి ఈ సందర్భంగా చెప్పింది. ప్రతి ఒక్క మహిళ చదువుకొని, సమాజంలో తగిన గౌరవం పొందాలన్నదే సినిమా సారాంశమని తెలిపింది. తన సాటి స్త్రీల బాగు కోసం పోరాడే రజ్జోగా మాధురి ఇందులో కనిపిస్తుంది. గులాబ్‌గ్యాంగ్ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా, హైకోర్టు స్టే విధించింది. సంపత్‌పాల్ పిటిషన్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తన జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారని, కొన్ని సన్నివేశాలు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉన్నందున విడుదలపై స్టే విధించాలని సంపత్ కోర్టును కోరింది. -
'గులాబ్ గ్యాంగ్' విడుదలపై ఢిల్లీ కోర్టు స్టే విధింపు
మాధురీ దీక్షిత్, జుహీ చావ్లా నటించిన గులాబ్ గ్యాంగ్ చిత్ర విడుదలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దేశవ్యాప్తంగా విడుదల కాకుండా ఆపివేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే8 తేది లోపు సెన్సార్ పూర్తి అయినా.. కాకున్నా చిత్రాన్ని ప్రదర్శించడానికి వీలులేదని కోర్టు ఆదేశించింది. -
నా భార్య నా ఇష్టం అన్నాడు!
ఇంకొకడు అలా అనకూడదని... పన్నెండేళ్ల వయసుకే సంపత్ పాల్ దేవి ఒక గొర్రెపిల్లలా భర్త వెనకే నడిచి, మెట్టినింట అడుగుపెట్టింది. ఇరవై ఏళ్లకే ఐదుగురు పిల్లల తల్లి అయింది. గొర్రెల కాపరి అయిన ఆమె తండ్రి తన కూతురుని ఎంత త్వరగా ఇంకొకరి కాపలాకి ఇస్తే అంత త్వరగా తన భారం వదులుతుందని భావించాడే తప్ప, తర్వాత పిల్ల భవిష్యత్తు ఏమిటని ఆలోచించలేదు. బడిపిల్లలకు ఐస్‌క్రీమ్ అమ్ముతుండే దేవి భర్త కూడా తన భార్యాపిల్లలకు చల్లని జీవితాన్ని ఇవ్వలేకపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక నిరుపేద గ్రామాల్లో మహిళల పరిస్థితి చాలావరకు ఇలాగే ఉంటుంది. బాల్యంలోనే వివాహం అయిపోతుంది. అక్కడితో చదువు ఆగిపోతుంది. అక్కడి నుంచి భర్త వేధింపులు సాధింపులు మొదలవుతాయి. దేవి కూడా అలాంటి సగటు గృహిణే. తను, తన కుటుంబం, తన కష్టాలు... అంతే. గుట్టుగా నెట్టుకొస్తోంది. అయితే ఆమె జీవితంలోని ఓ క్షణం ఆమెను పూర్తిగా మార్చేసింది. ఆమెలోని దృఢత్వాన్ని, నాయకత్వ లక్షణాలను బయటికి తెచ్చింది. చివరికిప్పుడు ఆమెపై ఓ సినిమా కూడా వస్తోంది! అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందు మార్చి 7న దేశవ్యాప్తంగా విడుదల అవుతోన్న ‘గులాబ్ గ్యాంగ్’ చిత్రంలో సంపత్‌పాల్ దేవి పాత్రను మాధురీ దీక్షిత్ పోషిస్తున్నారు. 2006లో ఓరోజు సంపత్ పాల్ దేవి తన ఇంటి బయట, అత్యంత బాధాకరమైన దృశ్యం చూసింది. ఓ భర్త తన భార్యను గొడ్డును కూడా బాదని విధంగా బాదుతున్నాడు. ‘చచ్చిపోతాను, నన్ను కొట్టొద్దు’ అని ఆ భార్య అతడి కాళ్ల మీద పడి ప్రాధేయపడుతోంది. అయినా ఆమె భర్త కరుణించలేదు. అడ్డుపడిన వాళ్లను సైతం కొట్టబోయాడు. ‘నా భార్య. నా ఇష్టం’ అన్నాడు. ఆ రాత్రి సంపత్ పాల్ దేవి నిద్రపోలేదు. తెల్లవారుజామునే లేచి కొంతమంది మహిళలను సమీకరించుకుంది. అందరి చేతుల్లో కర్రలు! అంతా కలిసి ఆ భర్త ఇంటి మీదికి వెళ్లారు. అతడి బయటికి రప్పించి, దేహశుద్ధి చేశారు. అదీ ఆరంభం. బుందేల్‌ఖండ్ గ్రామంలో గులాబీ రంగు చీరలు ధరించిన ‘గులాబీ గ్యాంగ్’ ఆవిర్భవించింది. 2010 నాటికి రాష్ట్రవ్యాప్తం, దేశవ్యాప్తం అయింది. ఎక్కడైనా, ఏ ఇంట్లోనైనా స్త్రీపై దౌర్జన్యం, గృహహింస జరుగుతోందని తెలిస్తే గులాబీ గ్యాంగ్ అక్కడ ప్రత్యక్షమౌతోంది. ప్రలోభాలకు లోను కాకూడదన్న కారణంతో ప్రభుత్వం యంత్రాంగం నుంచీ, స్వచ్ఛంద సేవాసంస్థల నుంచి ఎలాంటి ఆసరా కోరకుండా సంపత్‌పాల్ దేవీ తన సైన్యాన్ని తను నిర్మించుకుంది. ప్రస్తుతం ఈ సైన్యంలో యాభై వేల మంది మహిళా సైనికులు ఉన్నారు. ‘ప్రతి ఆడపిల్లా చదువుకోవాలి. ప్రతి మహిళా స్వేచ్ఛగా జీవించాలి’. ఇదే సంపత్ పాల్ దేవి ధ్యేయం. ‘గులాబ్ గ్యాంగ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న సౌమిక్ సేన్... సంపత్ పాల్ దేవి గొప్పతనాన్ని ప్రశంసిస్తూనే... తన చిత్రానికి, ఆమె నిజ జీవితానికీ ఎలాంటి సంబంధమూ లేదని అనడం ఇప్పటికే అనేక విమర్శలకు దారితీసింది. సంపత్‌పాల్‌కి ఆయన గుర్తింపు ఇచ్చినా ఇవ్వకున్నా ఈ సినిమా మాత్రం తప్పకుండా మహిళలోని పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచి తీరుతుంది. ఈ ఏడాది ఒకరోజు ముందే మహిళా దినోత్సవం వస్తోంది! మార్చి 7న గులాబ్ గ్యాంగ్ చిత్రం విడుదలవుతోంది. -
విలన్ ను చితకబాదేసిన మాధురీ దీక్షిత్
ముంబై: మాధురీ దీక్షిత్ పేరు వినగానే ఆమె చేసిన అద్భుతమైన నృత్యాలు గుర్తుకొస్తాయి. 1990ల్లో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది. అలాంటి మాధురీ నెల రోజుల పాటు కుంగ్ ఫూలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కర్ర తిప్పడం, కత్తిపట్టడం తదితర విన్యాసాలను నేర్చుకుంది. ఇంకేం విలన్ ను చితకబాదేసింది. త్వరలో విడుదల కానున్న 'గులాబ్ గ్యాంగ్' చిత్రం కోసమే ఈ కసరత్తంతా. ఈ చిత్రంలో మాధురీ పోరాట సన్నివేశాల్లో ఇరగదీసిందట. ఒకప్పుడు నెంబర్ వన్ స్థానం కోసం తనతో పోటీపడ్డ మరో అందాల నటి జూహిచావ్లాతో కలసి ఈ సినిమా ద్వారా తొలిసారి వెండితెరను పంచుకోవడం మరో విశేషం. గులాబ్ గ్యాంగ్ చిత్రంలో మాధురీ ఫైటింగ్ సీన్ల కోసం ట్రైనర్ కనిష్క శర్మను పెట్టుకుని శిక్షణ తీసుకుంది. అనుభవ్ సిన్హా నిర్మించిన ఈ చిత్రం మార్చి ఏడున విడుదలకానుంది. ఈ చిత్రంలో జూహీచావ్లా నెగిటివ్ పాత్రలో నటిస్తోంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉండే కొంతమంది మహిళల స్ఫూర్తితో ఈ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు. -
నా డిక్షనరీలో కష్టమనే పదం లేదు
తన కెరీర్ డిక్షనరీలోనే కష్టసాధ్యమైన అనే పదం లేనేలేదని బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ అన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే జయించేందుకే ఇష్టపడతానని ఆమె తెలిపారు. రాబోయే సినిమా గులాబ్ గ్యాంగ్‌లో సొంతంగా మాధురి స్టంట్లు చేశారు. కొత్తవ్యక్తి సౌమిక్ సేన్ దర్శకత్వం వహించిన గులాబ్ గ్యాంగ్ సినిమా ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖాండ్‌లోని సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా గులాబీ రంగు చీరల్లో ఇండియన్ ఉమెన్ విజిలెంట్స్ బృందం చేసిన పోరాటం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో డ్యాన్స్, నటనలో ఎలాంటి ఇబ్బంది పడలేదని మాధురి దీక్షిత్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే తైక్వాండోలో శిక్షణ తీసుకోవడం వల్ల యాక్షన్ చేయడం మరింత సులభమైందని చెప్పారు. ఈ సినిమాల్లో ఫైట్లు, నటనలు సొంతంగానే చేశానని వివరించారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో గాయపడిన ఘటనలు ఉన్నా పట్టించుకోలేదన్నారు. తన డిక్షనరీలో కష్టసాధ్యమైన అనే పదం లేదన్న మాధురి సమస్యను గెలిచేందుకు ఇష్టపడతానని వ్యాఖ్యానించారు. బాక్సాఫీస్ వద్ద గులాబ్ గ్యాంగ్ సినిమా మంచి వ్యాపారం చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాతో తొలిసారిగా జుహి చావ్లా, మాధురి స్క్రీన్‌పై కనపడనున్నారు. గతంలో వీరిద్దరి కలిసి నటించేందుకు అవకాశాలు వచ్చినా ఆ సమయంలో జుహీ తిరస్కరించారు. ‘ఈ సినిమాలో మాధురితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. గతంలో కలిసి పనిచేయనందుకు పశ్చాత్తాపం లేదు. మళ్లీ ఒకసారి ఆమెతో కలిసి పనిచేస్తానని భావిస్తున్నా. సినిమాలో ఇద్దరు కలిసి వేర్వేరు పాత్రలు పోషిస్తున్నప్పుడు ఒకరితో మరొకరిని పోల్చుకోలేమ’ని జుహీ చావ్లా అన్నారు. ఈ సినిమాలో తాను హీరోగా, ఆమె విలాన్గా నటిస్తోందని తెలిపారు. విలన్‌గా మాధురి అద్భుత నటనతో ఆకట్టుకుందన్నారు. వివిధ విషయాల్లో మహిళలలో అవగాహన పెంచాల్సిన అవసరముందని, ఈ సినిమా అదే ప్రయత్నం చేస్తుందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన మార్చి ఏడున గులాబ్ గ్యాంగ్ సినిమా విడుదల కానుంది. -
మాధురీ దీక్షిత్‌తో ఇదే చివరిసారి
అందాల భామలు మాధురీ దీక్షిత్, జూహిచావ్లా 1990ల్లో బాలీవుడ్‌ను ఊపేశారు. ఓ దశలో వీరిద్దరూ నెంబర్ వన్ స్థానం కోసం నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. కాగా రేసులో మాధురీనే దూసుకెళ్లారు. అయితే, అప్పట్లో మాధురీ, జూహి ఇద్దరూ కలసి తెరను పంచుకోలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిచ్చాక తొలిసారిగా కలిసి నటించడం విశేషం. 'గులాబ్ గ్యాంగ్' చిత్రంలో ఈ భామలు అభిమానులను అలరించనున్నారు. అయితే భవిష్యత్‌లో తామిద్దరూ కలసి మళ్లీ నటించే అవకాశం వస్తుందని భావించడం లేదని జుహి అన్నారు. 'మాధురితో కలసి నటించే చివరి చిత్రం (గులాబ్ గ్యాంగ్) ఇదే కావచ్చు. మరో అవకాశం వస్తుందని అనుకోవడం లేదు. ఇలాంటి స్క్రిప్ట్, పాత్రలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. అప్పడు అంకితభావంతో నటించగలం. అందుకే ఈ చిత్రం కోసం అభిమానులతో మేమూ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం' అని జుహి చెప్పారు. గతంలో మాధురితో కలసి నటించే అవకాశం వచ్చినా అప్పట్లో ఉన్న పోటీ దృష్య్టా అంగీకరించలేదని గతాన్ని గుర్తుచేసుకుంది. -
స్టార్డమ్ పిల్లలకు ఇబ్బందిగా మారలేదు: మాధురీ
పెళ్లి పేరు ఎత్తితే సినీ తారలకు గుండె కొట్టుకోవడం ఆగిపోవడం ఖాయం. ఇక పెళ్లి తర్వాత పిల్లలు కూడా ఉంటే ఇక వారి చాప్టర్ క్లోజ్. వీటన్నింటికి భిన్నంగా ఒకప్పుడు అగ్రస్థానంలో కొనసాగిన మాధురీ దీక్షిత్ బాలీవుడ్లో మళ్లీ మెరుపులు మెరిపిస్తోంది. అయితే నా స్టార్డమ్ పిల్లలకు ఎలాంటి ఇబ్బందిని కలిగించలేదు’ అని మాధురీ దీక్షిత్ తెలిపింది. అమెరికా స్థిరపడిన డాక్టర్ శ్రీరాం మాధవ్ నేనేతో వివాహం తర్వాత మాధురీ దీక్షిత్ కు ఆరిన్, రాయన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపిస్తున్న మాధురీని చూసి ఆమె పిల్లలు తెగ సంబరపడిపోతున్నారట. ‘మమ్మీ నీవు టీవీలో కనిపించావు. నిజంగా నీవు అంత గొప్పదానివా?’ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒళ్లో వాలుతారు అని మాధురీ వెల్లడించింది. బాలీవుడ్, టెలివిజన్ రంగంలో తనకున్న స్టార్డమ్ తన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం తన అదృష్టమని, వాళ్లు అమాయకంగా ఉండటమే తనకు ఇష్టం అని తెలిపింది. పెళ్లి తర్వాత ఓ దశాబ్దం పాటు అమెరికాలో గడిపిన మాధురీ దీక్షిత్ 2011లో భారత్‌కు మాధురీ తిరిగివచ్చింది. ప్రస్తుతం గులాబ్ గ్యాంగ్, దేద్ ఇష్కియా చిత్రాల తోపాటు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, కొరియోగ్రాఫర్ రెమోతో కలిసి కలర్స్ టెలివిజన్ చానెల్లో ’ఝలక్ దిక్లా జా’ అనే డాన్స్ రియాల్టీ షోలో మాధురీ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఇప్పుడిప్పుడే బిజీగా మారుతోంది.