నా భార్య నా ఇష్టం అన్నాడు!
ఇంకొకడు అలా అనకూడదని...
పన్నెండేళ్ల వయసుకే సంపత్ పాల్ దేవి ఒక గొర్రెపిల్లలా భర్త వెనకే నడిచి, మెట్టినింట అడుగుపెట్టింది. ఇరవై ఏళ్లకే ఐదుగురు పిల్లల తల్లి అయింది. గొర్రెల కాపరి అయిన ఆమె తండ్రి తన కూతురుని ఎంత త్వరగా ఇంకొకరి కాపలాకి ఇస్తే అంత త్వరగా తన భారం వదులుతుందని భావించాడే తప్ప, తర్వాత పిల్ల భవిష్యత్తు ఏమిటని ఆలోచించలేదు. బడిపిల్లలకు ఐస్‌క్రీమ్ అమ్ముతుండే దేవి భర్త కూడా తన భార్యాపిల్లలకు చల్లని జీవితాన్ని ఇవ్వలేకపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక నిరుపేద గ్రామాల్లో మహిళల పరిస్థితి చాలావరకు ఇలాగే ఉంటుంది. బాల్యంలోనే వివాహం అయిపోతుంది. అక్కడితో చదువు ఆగిపోతుంది. అక్కడి నుంచి భర్త వేధింపులు సాధింపులు మొదలవుతాయి.
దేవి కూడా అలాంటి సగటు గృహిణే. తను, తన కుటుంబం, తన కష్టాలు... అంతే. గుట్టుగా నెట్టుకొస్తోంది. అయితే ఆమె జీవితంలోని ఓ క్షణం ఆమెను పూర్తిగా మార్చేసింది. ఆమెలోని దృఢత్వాన్ని, నాయకత్వ లక్షణాలను బయటికి తెచ్చింది. చివరికిప్పుడు ఆమెపై ఓ సినిమా కూడా వస్తోంది! అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందు మార్చి 7న దేశవ్యాప్తంగా విడుదల అవుతోన్న ‘గులాబ్ గ్యాంగ్’ చిత్రంలో సంపత్‌పాల్ దేవి పాత్రను మాధురీ దీక్షిత్ పోషిస్తున్నారు.
2006లో ఓరోజు సంపత్ పాల్ దేవి తన ఇంటి బయట, అత్యంత బాధాకరమైన దృశ్యం చూసింది. ఓ భర్త తన భార్యను గొడ్డును కూడా బాదని విధంగా బాదుతున్నాడు. ‘చచ్చిపోతాను, నన్ను కొట్టొద్దు’ అని ఆ భార్య అతడి కాళ్ల మీద పడి ప్రాధేయపడుతోంది. అయినా ఆమె భర్త కరుణించలేదు. అడ్డుపడిన వాళ్లను సైతం కొట్టబోయాడు. ‘నా భార్య. నా ఇష్టం’ అన్నాడు. ఆ రాత్రి సంపత్ పాల్ దేవి నిద్రపోలేదు. తెల్లవారుజామునే లేచి కొంతమంది మహిళలను సమీకరించుకుంది. అందరి చేతుల్లో కర్రలు! అంతా కలిసి ఆ భర్త ఇంటి మీదికి వెళ్లారు. అతడి బయటికి రప్పించి, దేహశుద్ధి చేశారు. అదీ ఆరంభం. బుందేల్‌ఖండ్ గ్రామంలో గులాబీ రంగు చీరలు ధరించిన ‘గులాబీ గ్యాంగ్’ ఆవిర్భవించింది. 2010 నాటికి రాష్ట్రవ్యాప్తం, దేశవ్యాప్తం అయింది.
ఎక్కడైనా, ఏ ఇంట్లోనైనా స్త్రీపై దౌర్జన్యం, గృహహింస జరుగుతోందని తెలిస్తే గులాబీ గ్యాంగ్ అక్కడ ప్రత్యక్షమౌతోంది. ప్రలోభాలకు లోను కాకూడదన్న కారణంతో ప్రభుత్వం యంత్రాంగం నుంచీ, స్వచ్ఛంద సేవాసంస్థల నుంచి ఎలాంటి ఆసరా కోరకుండా సంపత్‌పాల్ దేవీ తన సైన్యాన్ని తను నిర్మించుకుంది. ప్రస్తుతం ఈ సైన్యంలో యాభై వేల మంది మహిళా సైనికులు ఉన్నారు. ‘ప్రతి ఆడపిల్లా చదువుకోవాలి. ప్రతి మహిళా స్వేచ్ఛగా జీవించాలి’. ఇదే సంపత్ పాల్ దేవి ధ్యేయం.
‘గులాబ్ గ్యాంగ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న సౌమిక్ సేన్... సంపత్ పాల్ దేవి గొప్పతనాన్ని ప్రశంసిస్తూనే... తన చిత్రానికి, ఆమె నిజ జీవితానికీ ఎలాంటి సంబంధమూ లేదని అనడం ఇప్పటికే అనేక విమర్శలకు దారితీసింది. సంపత్‌పాల్‌కి ఆయన గుర్తింపు ఇచ్చినా ఇవ్వకున్నా ఈ సినిమా మాత్రం తప్పకుండా మహిళలోని పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచి తీరుతుంది.
ఈ ఏడాది ఒకరోజు ముందే మహిళా దినోత్సవం వస్తోంది!
మార్చి 7న గులాబ్ గ్యాంగ్ చిత్రం విడుదలవుతోంది.