
నా శరీరాకృతిపై అప్పట్లో ఎన్నో విమర్శలు..
ఒకప్పుడు బాలీవుడ్ లో తన అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన హీరోయిన్ మాధురీ దీక్షిత్.
ముంబై:
ఒకప్పుడు బాలీవుడ్ లో తన అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన హీరోయిన్ మాధురీ దీక్షిత్. ఆమె అందమైన హీరోయిన్ మాత్రమే కాదు.. మంచి అభినయం ఉన్న నటి అని చెప్పవచ్చు. మాధురీ అంటే మొదట గుర్తొచ్చేది ఆమె డ్యాన్స్. ఆమె స్టెప్పులకు ప్రేక్షకులు ఎవరైనా సరే దాసోహం అయిపోయేవారు. మూడు దశాబ్దాల కిందట 'అబోధ్'తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 'ఏకో.. దో. తీన్..' అంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. హీరోయిన్ గా ఆమె ఎంట్రీ ఇచ్చిన రోజులను తలుచుకుంటే ఆమెకు ఇప్పటికీ దిగులుగానే ఉంటుందట.
ఆమె ఎంట్రీ ఇచ్చే వరకు హీరోయిన్ అనగానే నాజుకు నడుము ఉండాలని ప్రేక్షకులు భావించేవారు. అయితే తన శరీరాకృతి హీరోయిన్ అవ్వడానికి ఫర్ఫెక్ట్ కాదని కాస్త ఆందోళన చెందినట్లు తెలిపింది. ఆమె బొద్దుగా ఉందంటూ ఎన్నో విమర్శలు రావడమే అందుకు కారణమని వివరించింది. ఆ విమర్శలను లెక్క చేయకుండా తన పనిని చేసుకుంటూ పోతూ పేరు సంపాదించుకున్నానని చెప్పింది. ఎన్నో కష్టాలు పడ్డప్పటికీ కెరీర్ లో విజయాన్ని సాధించడంతో అప్పటి బాధలను మరిచి పోయానని పేర్కొంది. అనుకున్న లక్ష్యాలను సాధించడంతో ఎంతో సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది.