ఇళయరాజా
సంగీతజ్ఞాని ఇళయరాజాకు శనివారం సాయంత్రం చెన్నైలో ఘనసత్కారం జరిగింది. 1000కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించి రికార్డుకెక్కిన ఇళయరాజా 75 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సంగీత రాజాకు తమిళ నిర్మాతల మండలి చెన్నైలో అభినందన సభ నిర్వహించింది. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు, చెన్నై నందనంలోని వైఎంసీఏ మైదానంలో బ్రహ్మాండమైన సంగీత విభావరిని తలపెట్టారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం జరిగిన ఈ సంగీత కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘1996లో ‘అన్నక్కిళి’ చిత్రంతో తన సంగీత పయనాన్ని ప్రారంభించిన ఇళయరాజా గ్రామీణ, తమిళ సంప్రదాయ పాటలకు ప్రాణప్రతిష్ట చేశారు. 13 రోజుల్లో సింపోనికి బాణీలు కట్టి ప్రపంచ రికార్డు సాధించిన ఘనత ఇళయరాజాది. ప్రపంచస్థాయిలో అభిమాన గణం కలిగిన ఇళయరాజా ఇంకా పదికాలాల పాటు సంగీత దర్శకుడిగా కొనసాగాలి’’ అన్నారు. సంగీత సామ్రాజ్యానికి ఏకైక రారాజు ఇళయరాజానే అని తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్ సంగీతజ్ఞానిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్ తన మార్గదర్శి ఇళయరాజానే అని పేర్కొన్నారు. కాగా ఈ వేదికపై సినీ పరిశ్రమ తరఫున ఇళయరాజాకు బంగారంతో చేసిన వయోలిన్‌ను బహూకరించి ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment