
తెలుగు.. తమిళ్..మళ్లీ మహేశ్?!
ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత డీవీవీ దానయ్య నిర్మాణంలో దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత మరోసారి తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో మహేశ్ నటించే అవకాశాలున్నాయి. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను మహేశ్ బాబు హీరోగా ద్విభాషా చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘రాజా రాణి’, విజయ్ ‘పోలీస్’ సినిమాల ఫేమ్ అట్లీ సహాయ దర్శకుడు బాస్కో మన ప్రిన్స్ మహేశ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ కథ రాసుకున్నారు. ప్రస్తుతం మురుగదాస్ సినిమా షూటింగ్ నిమిత్తం చెన్నైలో ఉన్న మహేశ్‌ను కలసి దర్శక-నిర్మాతలు చర్చించారట. కథపై డిస్కషన్స్ జరుగుతున్నాయని నిర్మాత సన్నిహిత వర్గాల సమాచారం.
మహేశ్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... రజనీకాంత్ ‘కబాలి’తో సహా తమిళంలో పలు భారీ సినిమాలు నిర్మించిన కలైపులి ఎస్.థాను నేరుగా తెలుగులో సినిమా తీస్తున్నట్లు అవుతుంది. విజయ్ ‘పోలీస్’ (తమిళంలో ‘తెరి’) నిర్మించింది కూడా థానూనే. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లోనే అట్లీ అసోసియేట్ బాస్కోపై నిర్మాతకు నమ్మకం కలిగిందట. ఇటీవల ఓ ఆడియో వేడుకలో నా అసోసియేట్‌తో థానుగారు సినిమా నిర్మిస్తానని చెప్పారని అట్లీ వ్యాఖ్యానించారు.