మైనపు బొమ్మతో సితార, నమ్రత, మహేశ్‌బాబు, గౌతమ్
ప్రపంచప్రఖ్యాత మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్‌బాబు కూడా చేరారు. ప్రపంచం నలుమూలలా ఎంతో గొప్ప ఫాలోయింగ్ ఉన్నవారిని సెలెక్ట్ చేసుకొని వారి రూపాల్ని మైనపు బొమ్మలుగా చేసి మ్యూజియంలో ఉంచటం మేడమ్ టుస్సాడ్స్ ప్రత్యేకత. ఇప్పటివరకూ మేడమ్ తుస్సాడ్స్‌లో ఉత్తరాది హీరోలు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, హీరోయిన్లు కరీనా కపూర్, కత్రినా కైఫ్‌లతో పాటు చాలామంది మైనపువిగ్రహాలు దర్శనమిస్తుంటాయి. తెలుగు స్టార్ ప్రభాస్ బొమ్మ ఆల్రెడీ బ్యాంకాక్ తుస్సాడ్స్ మ్యూజియమ్‌లో ఉంది.
ఇప్పుడు మహేశ్‌బాబు. సింగపూర్‌లోని సెంథోసా ఐల్యాండ్‌లో తుస్సాడ్స్ మ్యూజియం మహేశ్ మైనపు విగ్రహాన్ని మరో వారంరోజుల్లో ప్రతిష్టించనున్నారు. ఈ లోపు మహేశ్‌బాబు మైనపు ప్రతిమను సోమవారం హైదరాబాద్‌లో ‘ఏఎంబీ మాల్’లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడమ్ తుస్సాడ్స్ సింగపూర్ జనరల్ మేనేజర్ అలెక్స్ వార్డ్ మాట్లాడుతూ– ‘‘తుస్సాడ్స్‌లో పెట్టే ఏ విగ్రహాన్నీ వేరే ఎక్కడా ఆవిష్కరించ కుండా నేరుగా మ్యూజియంలోనే పెడతాం. మహేశ్ విగ్రహాన్ని మాత్రమే ముందు ఇక్కడ ఆవిష్కరించటం చాలా ఆనందంగా ఉంది.
మహేశ్‌బాబు మైనపు బొమ్మను తయారు చేయటానికి గతేడాది మా టీమ్ ఇండియాకి వచ్చి దాదాపు 200 శరీర కొలతలు తీసుకున్నారు. మహేశ్ కనుగుడ్డు, జుట్టు కొలతలతోపాటు ఆయన శరీర సౌష్టవాన్ని మ్యాచ్ చేయటానికి 20 మంది ఆరు నెలల పాటు శ్రమించారు. మహేశ్ ‘శ్రీమంతుడు’ టైమ్ లుక్‌తో బొమ్మను తయారు చేశాం. ఇండియన్ సూపర్ స్టార్స్ అమితాబ్, షారుక్ ఖాన్‌ల విగ్రహాల సరసన మహేశ్‌బాబు విగ్రహం ఉంటుంది. మహేశ్‌బాబు కోరిక మేరకు ఆయన అభిమానుల కోసం మేం సింగపూర్ నుండి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించాం’’ అన్నారు.
మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఎంతో మంది ఇండియన్ సూపర్ స్టార్స్ మధ్యలో నేను కూడా భాగమవ్వటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. వీలైనంత త్వరలో నా ఫ్యామిలీతో కలిసి సింగపూర్ వెళ్లి నా ప్రతిమను అక్కడ చూసుకోవాలని ఉంది. మొదటిసారి సింగపూర్‌లో నా విగ్రహం పెడుతున్నారు అనే న్యూస్ తెలియగానే ఆ రోజు ఎంతో ఆనందంతో పాటు ఏదో సాధించాననిపించింది. నా కొలతలు ఇచ్చే రోజు వాళ్లు తీసుకున్న డీటైల్స్ చూస్తే నిజంగా నమ్మశక్యం కాలేదు. ముఖ్యంగా శిల్పులు ఇవాన్‌రీస్, బెన్‌డానా శ్రమ నిజంగా చాలా గొప్పది.
ఆ ప్రాసెస్‌లో కొన్ని విషయాలు చాలా నవ్వు తెప్పించాయి. వాళ్ల దగ్గర ఓ బాక్స్ ఉంది. అందులో చాలా రకాలైన కనుగుడ్లు ఉన్నాయి. వాటిని నా ముఖానికి దగ్గరగా పెట్టి సెలెక్ట్ చేయటం మరచిపోలేను. నా కళ్లు ఎలా చూస్తాయి, జుట్టు టెక్చర్ ఎలా ఉంది? అనేవి చాలా ముఖ్యం. మూడు నెలల క్రితం మా ఆవిడ నమ్రతకు ఫోన్‌లో పూర్తి అవ్వని బొమ్మ ఫొటో పంపారు. ఆ బొమ్మని నేను ఓ ఇద్దరు స్నేహితులకు చూపిస్తే, ఏదో ఫొటోషూట్ అనుకున్నారు. ఇంతకంటే అందంగా నన్నెవరూ తీర్చిదిద్దలేరు. థ్యాంక్స్ ఫర్ ది ఎంటైర్ టీమ్’’ అన్నారు.
‘‘మీ బొమ్మతో మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? అని మహేశ్‌ను అడిగితే – ‘‘ఎలా ఉన్నావు? బావున్నా’’ అంటా అన్నారు. అనంతరం తన ప్రతిమలానే పోజిచ్చి ఫొటోలు దిగారు. మహేశ్ భార్య నమ్రత ‘‘ఇద్దరు భర్తలున్నారు’’ అంటే, ‘ఇద్దరు మహేశ్‌లున్నారని ఆవిడ మాటలకు అర్థం’’ అని మహేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్, నమ్రతల కుమారుడు గౌతమ్. కుమార్తె సితారలతోపాటు దర్శకుడు మెహర్ రమేశ్, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ నారాయణ్‌దాస్ నారంగ్, సునిల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.
బొమ్మతో బొమ్మలా...
Comments
Please login to add a commentAdd a comment