హైదరాబాద్‌లో మహేష్‌ మైనపు బొమ్మ | Mahesh Babu Madame Tussauds wax statue to inaugurate in Hyderabad  | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మహేష్‌ మైనపు బొమ్మ

Published Fri, Feb 22 2019 10:29 AM | Last Updated on Fri, Feb 22 2019 10:40 AM

Mahesh Babu Madame Tussauds wax statue to inaugurate in Hyderabad  - Sakshi

ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారి ఆధ్వరంలో మహేష్‌బాబు మైనపు బొమ్మను మార్చి 25న హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్నారు. మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు ఒక ప్రముఖుని ప్రతిమని సింగపూర్‌లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అభిమానులు తమ అభిమాన హీరోని పోలివుండే ప్రతిమతో సెల్ఫీలు, ఫోటోలు పంచుకునే అవకాశం లభిస్తోంది. ఆ తర్వాత మహేష్ మైనపు ప్రతిమ మేడం టుస్సాడ్స్ సింగపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగే ఐఫా ఉత్సవాల్లో భాగం కానుంది. తెలుగు సినిమాలో అత్యంత విజయవంతమైన నటులు, హీరోల్లో ఒకరైన మహేష్ ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. 

250 సంవత్సరాల చరిత్ర కలిగిన 'మేడం టుస్సాడ్స్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ 23 శాఖల్లో అంతర్జాతీయ ప్రముఖుల మైనపు ప్రతిమలు తయారు చేసి ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సందర్శకులకు వారి అభిమాన ప్రముఖుల్ని కలిసే అనుభూతిని ఇస్తోంది. మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు తన ప్రతిమని ఆవిష్కరిస్తున్న సందర్భంగా మహేష్‌ బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ ఈ గౌరవానికి చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతిమ తయారు చేయడానికి కావాల్సిన కొలతలు, ఇతర వివరాలు తీసుకోవడానికి నాలుగు గంటలు పట్టిందని తెలిపారు. అభిమానుల లాగానే, తాను కూడా మేడం టుస్సాడ్స్ వారు తయారు చేస్తున్న తన మైనపు బొమ్మని చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. 

ప్రతిమలు తయారు చేయడంలో సిద్ధహస్తులైన మేడం టుస్సాడ్స్ వారి నిపుణుల బృందం హైదరాబాద్ వచ్చి మహేష్ బాబు ని కలిసి 200 కి పైగా కొలతల్ని, అన్ని వివరాలని సేకరించారు. అచ్చం మహేష్ ని పోలి ఉండేలా బొమ్మని తయారు చేయడానికి జుట్టు, కళ్ళ రంగు వంటి విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకున్నారు. మేడం టుస్సాడ్స్ సింగపూర్ జనరల్ మేనేజర్ అలెక్స్ వార్డ్ మాట్లాడుతూ, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ ప్రతిమని తయారు చేయడం తమకు లభించిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. భారతదేశం నలుమూలల నుండి టూరిస్టులు మా శాఖని సందర్శిస్తుంటారు. భారతీయ సినీ ప్రముఖుల్ని వారికి అందుబాటులో ఉంచడమే మా లక్ష్యం అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement