నేను ఇలా ఉన్నానంటే, ఆయన వల్లే: మహేష్ | Mahesh Babu's Exclusive Interview on Srimanthudu | Sakshi
Sakshi News home page

నేను ఇలా ఉన్నానంటే, ఆయన వల్లే: మహేష్

Published Thu, Jul 23 2015 10:12 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

నేను ఇలా ఉన్నానంటే, ఆయన వల్లే: మహేష్

నేను ఇలా ఉన్నానంటే, ఆయన వల్లే: మహేష్

మహేశ్‌బాబు... బాల నటుడిగా మొదలుపెట్టి యువ హీరోగా ఆకట్టుకొని, ఇవాళ్టికీ ‘మోస్ట్ డిజైరబుల్ మ్యాన్’గా అలరిస్తున్న ఆరడుగుల అందగాడు. కళ్ళు కూడా నవ్వుతున్నట్లుండే నవ మన్మథ హీరో. కొద్దిపాటి విరామం తరువాత ఇప్పుడు మళ్లీ ‘పోకిరి’, ‘దూకుడు’ లాంటి హిట్స్ బాటలో మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ‘శ్రీమంతుడు’గా రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆగస్టు 9న పుట్టినరోజైతే, రెండు రోజుల ముందే ఆ సంబరాన్ని అభిమానులకు తేనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇంగ్లిష్ టీవీ చానల్ ‘ఇండియా టుడే’తో ఆయన తన మనసులో మాట పంచుకున్నారు. ఈసారి విజయం పట్ల దిలాసాగా ఉన్న ఈ ధీమంతుడు చెప్పిన కబుర్లు ఇవి...

‘శ్రీమంతుడు’ ఎలా ఉంటాడంటే...
‘శ్రీమంతుడు’ చాలా బలమైన కథ. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. నేను గతంలో చేసిన ‘బిజినెస్‌మేన్’, ‘దూకుడు’ చిత్రాల్లోని పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. శారీరకంగానూ, మానసికంగానూ చాలా స్ట్రాంగ్‌గా ఉండే క్యారెక్టర్ అది. సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. పాటల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నన్నడిగితే, ‘దూకుడు’ తరువాత నా సినిమాల్లో బెస్ట్ ఆల్బమ్ ఇదే. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కు థ్యాంక్స్.

అవి ఎప్పుడూ ఉంటాయి!
ప్రతి సినిమానూ దేనికదిగా చూస్తా. అది ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘దూకుడు’, ‘బిజినెస్‌మేన్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ - ఇలా దేనికదే! అవన్నీ సరైన సమయంలో సరైన విధంగా వచ్చాయి. అలాగే, మా నాన్న గారి నుంచి అభిమానులూ నాకు వచ్చారు. అది నాకు దక్కిన వరం. అందుకే, అదృష్టమో, దురదృష్టమో కానీ నా ప్రతి సినిమా మీద అంచనాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఈ ‘శ్రీమంతుడు’ మీద కూడా ఉన్నాయి. ప్రతిసారీ వాళ్ళకు నచ్చేలా ఏదో ఒకటి చేయడానికి శ్రమిస్తూ ఉంటా. అదే సమయంలో... అభిమానుల మాటెలా ఉన్నా, చేసే ప్రతి సినిమాలో నా మీద నేను పెట్టుకున్న అంచనాల్ని అధిగమించాల్సి ఉంటుంది.

ఆయన ప్రభావం ఉంది!
మా నాన్న గారే నాకు ఆదర్శం. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలే చూస్తూ పెరిగా. అందుకే, నా మీద ఆయన ప్రభావమే ఉంది. నాకు స్ఫూర్తి కూడా ఆయనే. నాన్న గారి నుంచి నేనెంతో నేర్చుకున్నా. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే, ఆయన వల్లే! అందుకే... ఆయన పట్ల నాకు అమితమైన కృతజ్ఞత.

ఆ రెండూ... అప్పటికప్పుడు ఓ.కె!
సినిమా ఒప్పుకోవాలా, వద్దా అనే విషయంలో నిర్ణయం పూర్తిగా నాదే. మా నాన్న గారి ప్రమేయం, నా వైఫ్ నమ్రత జోక్యం ఉండవు. నా నిర్ణయాలన్నీ స్క్రిప్ట్‌ను బట్టే ఉంటాయి. కొన్నిసార్లు అప్పటికప్పుడు ఓ.కె. చెప్పేస్తా. కొన్నిసార్లు కొద్దిగా టైమ్ తీసుకొని నిర్ణయం చెబుతా. నాకు గుర్తున్నంత వరకు ‘పోకిరి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ప్రాజెక్ట్‌లు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలే!

రిజల్ట్ దేవుడికే!
నేను ఎంచుకొనే ఏ సినిమాలో అయినా అందులోని పాత్ర నాకు ఎగ్జైటింగ్‌గా అనిపించాలి. ఆ తరువాత నేను నా బెస్ట్ ఇస్తాను. ఈ ప్రాసెస్ మొత్తాన్నీ ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తా. ఇక, ఫలితం అంటారా... అది దేవుడికి వదిలేస్తా!

చొక్కా విప్పేస్తా!
సర్వసాధారణంగా నాకు ఏది సూట్ అవుతుందో, కాదో నా దర్శకులకు తెలుసు. కాబట్టి, స్క్రిప్ట్‌ను బట్టి దర్శకుడు నా నుంచి ఏది కోరుకుంటే అది చేస్తా! నా పాత్రకూ, స్క్రిప్ట్‌కూ అవసరమని కన్విన్స్ అయితే, బాలీవుడ్‌లో లాగా చొక్కా విప్పేసి, నటిస్తా. ఇక, ‘శ్రీమంతుడు’ వరకు నా పాత్రను తీర్చిదిద్దిన పూర్తి క్రెడిట్ అంతా దర్శకుడు కొరటాల శివ గారిదే!

అప్పట్లో... ప్రయోగాలు!
గతంలో అయితే, స్టైల్ విషయంలో ప్రయోగాలు చేస్తుండేవాణ్ణి. కానీ, ఇప్పుడు మాత్రం సింపుల్‌గా ఉండడమే ఇష్టపడుతున్నా. నాకు వ్యక్తిగత హెయిర్‌స్టైలిస్ట్ ఉన్నారు. ఇక, దుస్తుల విషయంలో ఒక డిజైనర్ ఉన్నారు. ప్రతి సినిమాకూ ఆ డిజైనర్, సదరు సినిమా డెరైక్టర్‌తో చర్చించి, స్క్రిప్ట్‌ను బట్టి నా లుక్ ఎలా ఉండాలో నిర్ణయిస్తారు. ఇక, అందం, ఆరోగ్యం విషయంలో వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొనేందుకు ప్రయత్నిస్తుంటా. వీలైనంత వరకు నియమబద్ధంగా, సరైన ఆహారం తీసుకుంటా. ఆరోగ్యం కాపాడుకుంటూ ఉంటా.

ఏడాదికి రెండు సినిమాలైనా...
అభిమానులకు ఆనందం పంచేలా, వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనే నేనూ ప్రయత్నిస్తుంటా. కానీ, ఒకేసారి రెండు సినిమాల్లో నటించడం కొంచెం కష్టమే. ఎందుకంటే, ఒక పాత్రలోకి పరకాయప్రవేశం చేయడానికీ, బయటకు రావడానికీ టైమ్ పడుతుంది కదా! అయినా సరే, ఏడాదికి రెండు సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నా. అది కుదురుతుందని భావిస్తున్నా.

తెలుగులో మరిన్ని రావాలి!
వెంకటేశ్ గారితో కలసి నేను నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (2013) మంచి హిట్. ఆ సినిమా షూటింగ్ టైమ్ బ్రహ్మాండంగా గడిచింది. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించా. సెట్స్ మీదే కాదు... బయట కూడా వెంకటేశ్ గారితో నాకు బ్రహ్మాండమైన స్నేహం ఉంది. అలాంటి మల్టీస్టారర్లు తెలుగులో తప్పకుండా మరిన్ని రావాలి.

ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నా!
‘బాహుబలి’ రెండో పార్ట్ అయిపోయిన తరువాత నేను, దర్శకుడు రాజమౌళి కలసి ఒక సినిమా చేయనున్నాం. స్క్రిప్టు ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నా.

తమిళంలోనూ...
నాకు బాగా తెలిసిందల్లా - తెలుగు సినిమానే. ఇక్కడ పనిచేయడం నాకు హ్యాపీ. అయితే, మద్రాసులో పుట్టి పెరిగాను కాబట్టి, తమిళం గడగడా మాట్లాడగలను. తమిళం సినిమాలు చేయడం మాటెలా ఉన్నా, ప్రస్తుతానికి ‘శ్రీమంతుడు’ సినిమా తమిళ డబ్బింగ్ వెర్షన్‌ను కూడా తెలుగుతో పాటు ఒకేసారి విడుదల చేస్తున్నాం. నా సినిమా తమిళంలోనూ ఏకకాలంలో రిలీజవడం నా కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైమ్.

రాజకీయాలా...!?
మా నాన్న గారు గతంలో రాజకీయాల్లో కృషి చేశారు. మా బావ జయదేవ్ గల్లా ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఇవన్నీ నిజమే కానీ, నేను మాత్రం రాజకీయాల్లోకి వచ్చే సమస్యే లేదు. అసలు నాకు ఆ సంగతులేవీ తెలియదు. అవేవీ అర్థం కావు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement