రెండింతలు వచ్చింది | Mahesh Koneru on 118 working with NTR future projects | Sakshi
Sakshi News home page

రెండింతలు వచ్చింది

Published Sat, Mar 16 2019 12:31 AM | Last Updated on Sat, Mar 16 2019 12:31 AM

Mahesh Koneru on 118  working with NTR  future projects - Sakshi

‘‘ఇండస్ట్రీలోకి పాత్రికేయుడిగా వచ్చాను. సినిమాలకు రివ్యూస్‌ రాశాను. రివ్యూవర్స్‌ అభిప్రాయాలను గౌరవిస్తాను. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఒక నిర్మాతగా ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడు బాధగానే ఉంటుంది. ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు.. అనే సామెతలా... సినిమా చేసి చూడు అని అనుకోవచ్చు’’ అన్నారు నిర్మాత మహేశ్‌ కోనేరు. కల్యాణ్‌రామ్‌ హీరోగా కేవీ గుహన్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘118’. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని ఆనందం వ్యక్తం చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా మహేశ్‌ కోనేరు చెప్పిన విశేషాలు.

∙కల్యాణ్‌ రామ్‌గారి ‘నా నువ్వే’ సినిమా ప్రొడక్షన్‌లో ఇన్‌వాల్వ్‌ అయ్యాను. కానీ పూర్తిస్థాయి సోలో నిర్మాతగా ‘118’ నాకు తొలి సినిమా. ‘నా నువ్వే’ చిత్రాన్ని నమ్మి బాగా చేశాం. ఆశించిన ఫలితం రాలేదు. సినిమా వైఫల్యం చెందినప్పుడు బాధ కలిగింది. ఆ బాధ నుంచి తేరుకోవడానికి కాస్త టైమ్‌ పట్టింది.

∙‘నా నువ్వే’కు సరైన స్పందన రాకపోవడంతో ‘118’ చిత్రానికి కసిగా పని చేశాం. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రిలీజ్‌ డే మార్నింగ్‌ కాస్త డివైడ్‌ టాక్‌ వినిపించినప్పటికీ మ్యాట్నీ నుంచి మంచి స్పందన వచ్చింది. మంచి బుకింగ్స్‌ లభించాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌లో బుకింగ్స్‌ బాగా జరిగాయి.

∙కథ విని ఈ సినిమాను ఎన్టీఆర్‌ఆర్ట్స్‌ బ్యానర్‌లో చేద్దామని కల్యాణ్‌రామ్‌గారు అనుకున్నారు. కథ నచ్చి నేను నిర్మించాను. యూనిక్‌ పాయింట్‌. ఈ సినిమాతో కల్యాణ్‌రామ్‌గారికి నటన పరంగా మంచి పేరు వచ్చింది. గుహన్‌గారు సినిమాను మంచి థ్రిల్లింగ్‌ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు. కథ విన్నప్పుడే ఇందులోని ఆద్య పాత్రకు నివేథా ధామస్‌నే ఊహించుకున్నాం. స్క్రిప్ట్‌ విన్న తర్వాత ఆమె వెంటనే అంగీకరించారు. షాలినీ పాండే బాగా నటించారు. ఈ సినిమాకు ఒక రూపాయి ఖర్చు పెడితే రెండు రూపాయలు వచ్చాయి. 

∙ఈ సినిమాను ఎడిటింగ్‌ రూమ్‌లో ఎన్టీఆర్‌గారు చూసి, బాగుందని మెచ్చుకున్నారు. మాలో కాన్ఫిడెన్స్‌ పెరిగింది. ఆ తర్వాత ఈ సినిమాను ‘దిల్‌’ రాజు, శిరిష్‌లు చూశారు. ‘దిల్‌’ రాజుగారికి నచ్చడంతో సినిమాపై మాకున్న నమ్మకం రెట్టింపు అయింది.

∙ప్రస్తుతం కీర్తీ సురేశ్‌ కథానాయికగా ఓ ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ నిర్మిస్తున్నాం. ఈ ఏడాది సెకండాఫ్‌లో రిలీజ్‌ ప్లాన్‌ చేశాం. దర్శకుడు హరీష్‌ శంకర్‌తో కలిసి సినిమాలను నిర్మించే ఆలోచన ఉంది. కొత్తవారిని ప్రోత్సహించడమే మా ఉద్దేశం. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మా బ్యానర్‌లో ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాం. ఈ ఏడాది చివర్లో ఓ పెద్దహీరోతో సినిమా చేయబోతున్నాం. ఎన్టీఆర్‌గారితో సినిమాలు చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తాను. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement